IAS Officers | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కొడంగల్లో , ఇతర ఘటనల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని, ఏ పనైనా నిబంధనల ప్రకారమే చేయాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం కొందరు ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించడంతోపాటు మౌఖిక ఆదేశాలతో పనిచేయాలని మంత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో, ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన పలు పరిణామాలను, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో గుర్తుచేస్తూ.. భవిష్యత్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మనమే అనుభవించాల్సి ఉంటుందని తమ సహచరులను హెచ్చరించినట్టు సమాచారం. కొడంగల్లో దాడి నుంచి కలెక్టర్ తృటిలో బయటపడగలిగారని, ఒకవేళ ఆయనకు సీరియస్గా ఇంకేదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.