హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కొండా సుస్మితా పటేల్ స్పష్టంచేశారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడి కంపెనీ టెసరాక్ట్ కోసం రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? అని విలేకరి అడుగగా అవునంటూ సుస్మిత బదులిచ్చారు. అయితే అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని విలేకరి ప్రశ్నించారు. అవును టెసరాక్ట్ అనేది సీఎం సోదరుడి షెల్ కంపెనీ, ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాలను కట్టబెట్టారని ఆర్టీఐ రిపోర్టులో ఉన్నదని చెప్పారు. ఆ వివరాలన్నీ ఆర్టీఐ వెబ్సైట్లో కూడా స్పష్టంగా ఉన్నాయని, అవే ఆ ఆరోపణలకు ఆధారమని సుస్మిత కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
పరకాలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కొండా సుస్మిత మరోమారు తేల్చిచెప్పారు. పరకాల టికెట్‌ను రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఇస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని విలేకరి ప్రస్తావిస్తూ ‘మీరు పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా?’ అని ప్రశ్నించారు. దీనికి సుస్మిత స్పందిస్తూ.. అవును తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని, తాను మాత్రం కచ్చితంగా పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టంచేశారు.
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకు సంబంధం లేదని, అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కుమార్తె కొండా సుస్మితా పటేల్ స్పష్టంచేశారు. ఒక వ్యక్తి, అతని కుటుంబానికి సంబంధించి తాను వ్యాఖ్యలు చేశానని, తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదంటూ గురువారం ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీపై, సోనియా, రాహుల్‌గాంధీపై తనకు గౌరవం ఉన్నదని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయభేదాలు సహజమే అని, కొన్ని సందర్భాల్లో తల్లితోనైనా అభిప్రాయభేదాలు వస్తాయంటూ సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.