Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఒకటి. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా, చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలాకాలం గడిచినా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే పేరుతో తెరకెక్కించినట్లు సమాచారం. భారత్–చైనా సరిహద్దులో గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో కథను రూపొందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అనంతరం భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా పేరుతో పాటు కథనంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వ వర్గాల నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసి, సినిమాకు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే కొత్త పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మార్పుల కారణంగా సినిమా విడుదల కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటివరకు సినిమా విడుదలకు సంబంధించి స్పష్టమైన అప్డేట్ లేకపోవడంతో సల్మాన్ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు చిత్రబృందం సమర్పించిన కొత్త వెర్షన్‌పై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమాకు ఇటీవల ఎన్ఓసీ ఇచ్చినట్లు ఆ కథనం పేర్కొంది. అంటే ఈ చిత్రం ప్రజల కోసం ప్రదర్శించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన కీలక అనుమతి లభించినట్లుగా భావించవచ్చు. అయితే సినిమా థియేటర్లలో విడుదల కావడానికి ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ లభించిన నేపథ్యంలో ‘మాతృభూమి’ సినిమా ఇప్పుడు సీబీఎఫ్సీ పరిశీలనకు వెళ్లనుందని సమాచారం. అక్కడి నుంచి సర్టిఫికెట్ లభించిన తర్వాతే సినిమా థియేటర్లలో విడుదలకు మార్గం సుగమం కానుంది. కొత్తగా సమర్పించిన వెర్షన్లో భారత్–చైనా సంబంధాలను సానుకూల దృక్పథంలో చూపించినట్లు సమాచారం. ఇదే మార్పులు సినిమాకు ప్రభుత్వ అనుమతి లభించడంలో కీలకంగా మారినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘మాతృభూమి’కి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.