హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : కొండా సురేఖ ఉదంతం.. కాంగ్రెస్ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం వారం రోజుల నుంచి రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలపై ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచింది. కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారని విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమానించి ప్రచారం జరుగుతున్నది.
అందుకే వారి కదలికలపై పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులతో నిఘా పెట్టినట్టు తెలిసింది. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారని చెబుతున్నారు. ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారో ఆరా తీస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా కార్పొరేషన్ చైర్మన్లపై కూడా నిఘా పెట్టారు. శనివారం ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కూతురి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ శివారులోని జన్వాడలో జరుగగా, ఈ విందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఇలా హాజరైన వారు ఎవరెవరున్నారు? ఎవరెవరు కలిసి వచ్చారు? కలిసి వచ్చినప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుకున్నారన్న దానిపై ఆరా తీసినట్టు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మంత్రి సమీప బంధువుతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అల్పాహార భేటీకి వెళ్లారు. ఇది పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ఏం మాట్లాడుకొని ఉంటారో అనే అనుమానంతో ఆరా తీశారు. విషయాలు తెలుసుకునే క్రమంలో విపరీతంగా ప్రయత్నించారు.
చివరకు ఓ ఎస్పీ స్థాయి అధికారి సదరు కార్పొరేషన్ చైర్మన్‌కు ఫోన్ చేసి అన్నా.. ఏం మాట్లాడుకున్నారో చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేయడం గమనార్హం. ఇక నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రుల కదలికలపై కూడా నిఘా పెంచారు. సీఎం విదేశీ పర్యటనకు వెళ్లినప్పటి నుంచే నిఘా పెంచామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నిఘా విభాగం అధికారి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఇక ఇటీవల కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత జిల్లాస్థాయిలో కూడా నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశామని, పొలిటికల్ ఇంటెలిజెన్స్‌ను యాక్టివేట్ చేశామని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కదలికలను, ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతల కదలికలను తెలుసుకోవాలనుకుంటున్నదని వారు వెల్లడించారు.