హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): సుస్మిత వ్యాఖ్యలతో తమకేం సంబంధం లేదని కొండా మురళి తేల్చిచెప్పారు. బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భట్టితో భేటీలో సుస్మిత అంశం చర్చకు రాలేదని తెలిపారు. అది ఆమె ఇష్యూ అని, ప్లాన్-ఏలో ఏదో మాట్లాడిందని, ప్లాన్- బీలో ఏం చేస్తదో తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. వాళ్లది వాళ్లు చూసుకుంటారని తెలిపారు. ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని, తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టంచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ఇక చివరగా తిరుగుడు తమకు కొత్త కాదు.. పాత కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే పార్టీలు మారడం కొత్తేమీ కాదన్నట్టు చెప్పారు.