Konda Murali : తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన తర్వాత ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి తొలిసారిగా స్పందించారు. వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము పార్టీ మారుతున్నామంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. పదవి కోసం ఆత్మగౌరవాన్ని వదులుకోబోమని, కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఒక్కసారి సారీ చెబితే చాలని కాంగ్రెస్ నాయకులు సురేఖతో అన్నారని, కానీ పదవి ఉంటే ఉండనీ, పోతే పోనీ, క్షమాపణ మాత్రం చెప్పనని సురేఖ కరాఖండిగా చెప్పిందని మురళి ఆనాటి పరిణామాలను వివరించారు. పదవులు ఈరోజు వచ్చి రేపు పోతాయని, కానీ కృతజ్ఞత తమ రక్తంలో, కుటుంబంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తమ విధేయత కాంగ్రెస్ పార్టీకేనని స్పష్టం చేశారు.
రాహుల్‌గాంధీ వల్లే సురేఖకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చిందని, ఆయన్ను ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని కొండా మురళి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు తామే టికెట్లిస్తామని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వంటి నేతలు కూడా ఎన్నో పోరాటాలు చేసి పైకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు.
ఈ సందర్భంగా కొండా మురళి భావోద్వేగానికి గురయ్యారు. ‘నా శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయి, అయినా ఇంకా బతికే ఉన్నా’ అన్నారు. తానూ, సురేఖ ఒకే మాటపై ఉంటామని, అయితే తమ కుమార్తె రాజకీయ భవిష్యత్తు ఆమె ఇష్టమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కొండా దంపతులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టత వచ్చినట్లయింది.