హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మరో పదేండ్లపాటు తానే సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టారు. కొల్లాపూర్‌లో జరిగిన సభలో సీఎం మాటలను పోస్ట్ చేస్తూ ఎక్స్ వేదికగా అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘రాబోయే పదేండ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను.. నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ ఒకింత హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యల్ని అసలు కాంగ్రెస్‌వాదులు సమర్థిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి నేత కూడా ఎప్పుడూ తానే సీఎంనని ప్రకటించుకోలేదని, రేవంత్‌రెడ్డి అంతకన్నా గొప్ప నేతనా అంటూ మండిపడుతున్నారు.