హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 19 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల సొమ్ముతో మంత్రి ఫామ్ హౌస్‌లో వెలుగులు’ పేరిట బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై మంత్రి కోమటిరెడ్డి రుసరుసలాడగా, డిస్కమ్ అధికారులు సన్నాయినొక్కులు నొక్కారు. తన వ్యవహారం బయటకు ఎలా లీకైందంటూ టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యంపై మంత్రి విరుచుకుపడ్డారు. ‘నాకు ఫామ్‌హౌసే లేదు.. అసలు అక్కడికి కరెంట్ ఎవరు అడిగారు.. మీరే పేపరోళ్లకు చెప్పి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడుండ్రి’ అని అధికారులపై గరంగరమయ్యారు.
పేపర్లో వచ్చిన వార్త తప్పు అని ఓ ప్రకటన కూడా ఇవ్వాలని హుకూం జారీచేశారు. దీంతో దక్షిణ డిస్కమ్ యాజమాన్యం హడావుడిగా ప్రకటన విడుదల చేసింది. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం తప్పు అంటూ అధికారిక వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టింది. చిలుకూరు బాలాజీ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న గ్రామస్తులు, భక్తులు తరచూ ఎదుర్కొంటున్న విద్యుత్తు అంతరాయాలు, వోల్టేజీ హెచ్చుతగ్గుల సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు ప్రతిపాదనను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చింది.
మంత్రి కోమటిరెడ్డి పేరుతోనే సెపరేట్ డెడికేటెడ్ ఫీడర్ కోసం ఎస్టిమేషన్ వేశారు. రూ.1.17 కోట్లతో ఎస్టిమేషన్ తయారు చేసి కార్పొరేట్ ఆఫీసుకు పంపించారు. చిలుకూరు ఏఈతో పాటు రంగారెడ్డి జోన్ సీఈ వరకు అందరికీ ఈ విషయం తెలిసినా ‘నమస్తే తెలంగాణ’ కథనంతో అంతా గప్‌చుప్ అయ్యారు. ఇటీవల తన పని ఎందుకు ఆలస్యమవుతున్నదంటూ మంత్రి కోమటిరెడ్డి డిస్కమ్ ఉన్నతాధికారిని అడుగగా అది సర్క్యులేషన్లో ఉన్నదని త్వరలో పూర్తిచేస్తామని చెప్పినట్టు తెలిసింది.
కోమటిరెడ్డి పేరిటే అంచనాలు
సెపరేట్ ఫీడర్ ఎస్టిమేషన్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుమీదనే ఉన్నాయి. చిలుకూరులోని ఆయన ఫామ్‌హౌస్‌కు ముర్తుజాగూడ 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి 11 కేవీ డెడికేటెడ్ సెపరేట్ ఫీడర్ వేయడానికి కావలసిన ఎస్టిమేట్ నం.టీ-2628-65-01-13-04-001తో ఇచ్చారు. ఈ పనులను టీ అండ్ డీ (ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్) ఇంప్రూమ్మెంట్స్ టు ఒరిజినల్ వర్క్స్ కింద పని చేయడానికి అంచనాలు వేశారు. ఒకవేళ చిలుకూరు ప్రజల కోసమే అయితే వారి పేరిటే ఉండాల్సిన పనులను మంత్రి పేరిట ఎందుకు పెడుతున్నారు? ఆరున్నర కిలోమీటర్ల నుంచి ఏబీ కేబుల్ ఎందుకు తెప్పిస్తున్నారు? ఎస్టిమేషన్ కాపీ ఆయన పేరుతో ఎందుకు ఉన్నది? మంత్రి, డిస్కమ్ యాజమాన్యం వీటికి జవాబు చెప్పలేక ఎదురుదాడికి దిగడం గమనార్హం.
అధికారులపై మంత్రి ఒత్తిడి
‘నమస్తే’లో కథనం వచ్చిన తర్వాత అంచనాల విషయంలో కొన్ని టెక్నికల్ వ్యవహారాలతో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో చిలుకూరు ఏఈ ప్రజలకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయంటూ ప్రత్యేక ఫీడర్ కోసం ఎస్టిమేట్ వేశామని, అది ఎంత ఖర్చవుతుందో తనకు గుర్తులేదని చెప్పడం గమనార్హం. మంత్రి విషయం తనకు తెలియదని, అసలు ఆ మంత్రి వ్యవహారమే తన నోటీసులో లేదని చెప్పుకొచ్చారు. కానీ ఎస్టిమేట్ చేసి కార్పొరేట్ ఆఫీసుకు పంపించింది ఈ ఏఈనే కాగా ఇప్పుడు మాట మార్చడం వెనుక మంత్రి ‘భయం’ ఉన్నట్టు స్పష్టమవుతున్నది.