హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : కోహెడ్ మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్) రూపొందించిన రెండు లే అవుట్ డిజైన్లను సోమవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం మంత్రుల నివాసంలో పరిశీలించారు. దీనిని సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది ఆసియాలోనే అత్యంత పెద్ద మార్కెట్‌గా నిలవబోతున్నదన్నారు. రూ. 400 కోట్లకుపైగా నిధులతో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ మారెట్లయిన ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్‌కోట్, బరోడా (గుజరాత్) మారెట్లను సందర్శించి లేఅవుట్ల నమూనా తయారు చేసినట్టు తెలిపారు. సమీపంలో ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో రీజినల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో కోహెడ మారెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక కమిషనర్ హన్మంతు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీ లక్ష్మణుడు, ఇన్చార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.