హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు కోహెడలో నిర్మిస్తున్న పండ్ల మార్కెట్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం కోహెడ మార్కెట్ నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తామని, 199.13 ఎకరాల్లో గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు.
6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్, సోలార్ సిస్టం, కోల్డ్ స్టోరేజ్, లేబర్, మార్కెట్ సిబ్బంది నివాస సముదాయాలు నిర్మించనున్నట్టు చెప్పారు. మామిడి ఎగుమతుల కోసం వేపర్ హీట్ ట్రీట్మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కోహెడ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ బోర్డు ఎండీ జగ్‌వీర్‌సింగ్ యాదవ్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తదనుగుణంగా మార్కెట్ నిర్మాణ ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేసి నివేదిక రూపొందించాలని మంత్రి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, ఎస్ఈ రాధాకృష్ణమూర్తి, కన్సల్టెంట్ ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ ఉప సంచాలకురాలు పద్మహర్ష, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ చిలుక నర్సింహారెడ్డి, డీఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.