Kodangal | కొడంగల్, జూలై 12: ‘మెడికల్ కాలేజీ కోసం మా బతుకులను రోడ్డున పడేస్తరా? ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూములను అభివృద్ధి ముసుగులో గుంజుకుంటమంటే ఎట్ల? ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్న మా పొట్టకొట్టద్దు.. ఈ భూములను ఇచ్చేది లేదు’ అని ప్రభుత్వంపై రైతులు తిరగబడ్డారు. ప్రజాసంఘాల నాయకులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ‘కడా’ కార్యాలయం ఎదుట శుక్రవారం బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సర్వే నంబర్ 19లో తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అధికారులు తమను మూడు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్నామని చెప్పారు. వారసత్వంగా వ్యవసా యం చేసుకుంటూ ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పడు అభివృద్ధి పేరిట ప్రభుత్వం తమ భూములను గుంజుకోవడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. తగిన విలువ కట్టకుండా అరకొర ముట్టజెప్పి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కొడంగల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేయడం మంచిదే అయినా పేదలకు న్యాయం చేయకుండా భూములను స్వాధీ నం చేసుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎకరాకు 10 లక్షలు, ఉద్యో గం, ఇంటి స్థలం అని ఆశచూపి రైతులకు అన్యా యం చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాక్రాంతమై న సీలింగ్ భూములను స్వాధీనం చేసుకొని అభివృద్ధి పనులు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని సూచించారు.
భూముల స్వాధీనం తప్పదంటే భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 10 ప్రకారం తాము కోరిన చోట భూమికి భూమి, మార్కెట్ ధర ప్రకారం రూ.50 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో వివిధ పక్షాల నేతలు నాగిరెడ్డి, వెంకటయ్య, చంద్రయ్య, ఎరన్‌పల్లి శ్రీనివాస్, రమేశ్‌బాబు, సూర్యనాయక్, లింగం సాయి లు తదితరులు పాల్గొన్నారు.