Kazipet Railway Project | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజనకు ముందు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. రాష్ట్ర విభజన అనంతరం కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు స్వయంగా ప్రధానమంత్రితోపాటు సంబంధిత మంత్రికి అనేక వినతిపత్రాలు అందచేసినా కేంద్రంలో ఎలాంటి చలనం లేదు.
తెలంగాణ ప్రజల నుంచి కోచ్ ఫ్యాక్టరీ కోసం వచ్చిన ఒత్తిడి మేరకు ఎట్టకేలకు కాజీపేటలో పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ యూనిట్(పీహెచ్యూ)ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటన చేసి చేతులు దులుపుకున్నది. ఈ క్రమంలో కాజీపేటలో ఏర్పాటుచేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్కు తరలించింది.
నిరసనల నేపథ్యంలో అక్కడ ఓవర్‌హాలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి పనులు ప్రారంభించారు. 2023లో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఆ విషయాన్ని రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించారు. తాజాగా కాజీపేటలో మల్టీలెవల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాజీపేటలో ఏర్పాటుచేస్తున్నది మల్టీలెవల్ కోచ్ ఫ్యాక్టరీ అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం తెలిపినా స్పష్టత మాత్రం లేదు. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఏ ప్రాజెక్ట్ చేపడుతున్నారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.