మాదాపూర్, మే 15 : వెన్నునొప్పితో బాధపడుతున్న పదేండ్ల బాలుడికి కిమ్స్ వైద్యులు అరుదైన రోబోటిక్ సర్జరీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హిమసాయి అనే బాలుడికి తీవ్రమైన నొప్పి, వెన్నునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు కొండాపూర్‌లోని కిమ్స్ దవాఖానలో చేర్పించారు. సాధారణ పరీక్షల్లో సమస్య స్పష్టంగా తెలియకపోవడంతో కిమ్స్ దవాఖాన వైద్యులు ఎఫ్‌డీజీ-పెట్‌స్కాన్, టిష్యూ పరీక్షలు నిర్వహించారు.
దీంతో బాలుడు ఈవింగ్ సార్కోమా అనే అరుదైన వెన్నెముక క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఎల్4 ఎముకకు ట్యూమర్ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఆ బాలుడికి స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య, డాక్టర్ హర్ష విక్రమ్, ఆంకాలజిస్ట్, డాక్టర్ ప్రియాంకతో కూడిన బృందం ఏప్రిల్ 19న రోబోటిక్ సర్జరీ చేసింది. తెలుగు రాష్ర్టాల్లోనే మొదటిసారిగా రోబోటిక్ ఎన్‌బ్లాక్ వెర్టిబ్రా విధానం ద్వారా నాడులు దెబ్బతినకుండా ట్యూమర్‌ను పూర్తిగా తొలగించినట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఏప్రిల్ 27న బాలుడిని డిశ్చార్జి చేశామని పేర్కొన్నారు.