తిరుమలగిరి, ఫిబ్రవరి 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి నియోజకవర్గం తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రకటించారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనవంతుగా 250 గ్రాముల బంగారం ఇవ్వనున్నట్టు తెలిపారు. తిరుమలగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇమ్మడి సోమ నర్సయ్య బ్రదర్స్ 250 గ్రాములు, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు 10 తులాలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేంధర్‌రెడ్డి 6 తులాలు ప్రకటించారు. కాగా మోత్కూర్ ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, మోత్కూర్ జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, తిరుమలగిరికి చెందిన వ్యాపారవేత్త సామాంజనేయులు, గానుగుబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, గురజాల సర్పంచ్ గుండా శ్రీనివాస్ 5 తులాల చొప్పున ఇస్తామని వెల్లడించారు. మరికొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు తులం, అద్ద తులం చొప్పున బంగారం ఇస్తామని ప్రకటించారు. ఇలా నియోజకవర్గం తరఫున సేకరించిన కిలో బంగారాన్ని త్వరలోనే యాదాద్రికి వెళ్లి అధికారులకు అందచేయనున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రజాక్ తదితరులు పాల్గొన్నారు.