హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అబ్బబ్బ ఏం జనం.. ఎటుచూసినా గులాబీ వనం.. ఆ గులాల్ను సోషల్ మీడియా కూడా చల్లుకొన్నది.. వాట్సాప్ తెరిస్తే స్టేటస్లు, డీపీలు.. ఫేస్బుక్ తెరిస్తే పోస్టులు, కామెంట్లు.. ట్విట్టర్ తెరిస్తే ట్వీట్లు, లైకులు.. మొత్తంగా అటు ఖమ్మం సభలో, ఇటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బల ప్రదర్శన చేసినట్టే కనిపించింది. తండోపతండాలుగా తరలివచ్చిన జనాన్ని ఫొటోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, ‘ఏందయ్యా.. ఈ జనం’ అంటూ కామెంట్లు చేశారు.
‘ఇది బీఆర్ఎస్ బలం.. ఇక బీజేపీ ఖతం’ అన్న నినాదం ప్రతిధ్వనించింది. నెటిజన్లు ఫొటోలు, కామెంట్లు, ట్వీట్లను బీజేపీ సోషల్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు. ‘ఈ జనాన్ని చూసి బీజేపీకి ఈ రోజు నిద్దుర రాదు’ అని ట్విట్టర్లో రవిప్రతాప్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఖమ్మం సభకు ఇతర రాష్ర్టాల సీఎంలు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావటం సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. ఆ పోస్టులకు అదే తరహాలో స్పందనలు వచ్చాయి. జై కేసీఆర్.. జై భారత్ అంటూ సెకనుకో కామెంట్ జత చేరింది.
ఆకట్టుకున్న మీమ్స్
‘ఏంట్రా బాబు ఆ జనం.. ఎంత మంది ఉంటార్రా?’ అంటూ ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రకాశ్‌రాజ్ ఈ డైలాగ్ చెబుతున్నట్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఈ డైలాగ్‌కు తనికెళ్ల భరణి ఖమ్మం జనాలను చూస్తూ ‘కనుచూపు మేర అంతా జనమే.. కనిపించని వాళ్లు ఇంకెంతమంది ఉంటారో!’ అని చేసిన మీమ్ వైరల్‌గా మారింది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద వ్.. ‘తెలంగాణలో పని ఎక్కువ జరిగింది.. ప్రచా రం తక్కువగా జరిగింది. మా దగ్గర పని తక్కు వ.. ప్రచారం ఎక్కువ’ అంటూ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఖమ్మం సభ ఫొటోలను కొన్ని మీడియా సంస్థలకు పంపిస్తామని, నిజాలను దాచేందుకు అబద్ధపు ప్రచారాలు చేయొద్దని నెటిజన్లు అల్టిమేటం జారీ చేశారు. ‘ఖమ్మం సభలో ఖాళీ కుర్చీలు అని హెడ్డింగులు పెట్టకండిరా బత్తాయిలు.. వేరే దానితో నవ్వుతారు’ అంటూ సెటైర్లు వేశారు. నెటిజన్లు బీఆర్ఎస్పై అభిమానం, బీజేపీపై కొంటెతనం ప్రదర్శిస్తూ తమదైన శైలిలో సోషల్ మీడియాను హోరెత్తించారు. దీన్ని చూస్తే బీఆర్ఎస్ ఆవిష్కరణ సభ రెండు చోట్ల జరిగినట్టు కనిపించింది. ఒకటి ఖమ్మంలో, ఇంకోటి సోషల్ మీడియా వేదికపై!