హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ హబ్‌ల్లో ఖమ్మం సమగ్రమైన ఐటీ హబ్‌గా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మంగళవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్‌ని కలిసి ఖమ్మం ఐటీ హబ్ ప్రతమ వార్షిక నివేదిక 2021 ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,45,522 కోట్లుగా నమోదైందని అన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో 6,28,615 మందికి ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో సమాచార సాంకేతికతను విస్తరిస్తున్నామని, 1800 అంకురాలు(స్టార్టప్స్) ఏర్పాటయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ రంగంలోనూ ఖమ్మంకు ప్రథమ స్థానం లభించిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
వారి కృషితో ఖమ్మం ఇతర ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని అజయ్ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారని గుర్తు చేశారు.
అందులో భాగంగానే ఈ చర్యలను మంత్రి కేటీఆర్ చొరవతో చేపట్టామని వివరించారు. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.