ఖమ్మం, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు, భూకుంభకోణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రతి భూకుంభకోణం, భూదందా వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రుల హస్తాలే సాక్షాత్కరిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఓ సీనియర్ మంత్రి హస్తమున్న ఓ భారీ భూకుంభకోణం బయటపడింది. వివిధ మాధ్యమా ల ద్వారా వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుంభకోణంలో ఏకంగా ఆంధ్రా కంపెనీకి తెలంగాణ భూములను తక్కువ ధరకే కట్టబెట్టడం, అందులో నూ ఆ కంపెనీ తెలంగాణ యూనిట్లో సాక్షా త్తూ సదరు మంత్రి తనయుడే నిష్క్రియ భాగస్వామిగా ఉండటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు యోచించారు. దీంతో బుగ్గపాడు ఫుడ్‌పార్కుకు బీజం పడింది. అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చొరవ తీసుకొని బుగ్గపాడులో రైతుల నుంచి 203 ఎకరాలు సేకరించారు. ఎకరాని కి రూ.1.25 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ఆ తరువాత ఫుడ్‌పార్కు ఏర్పాటు సంగతి మూలనపడింది. తెలంగాణ సిద్ధించాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫుడ్‌పార్కును వినియోగంలోకి తెచ్చేందుకు, స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ముందడుగు వేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో కదలిక వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించింది. పనులకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటే తరువాయిగా మిగిలింది. ఈ లోగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొన్నాళ్లపాటు బుగ్గపాడు ఫుడ్‌పార్కు పనులను పక్కనపెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ అమాత్యుడి కన్ను ఆ ఫుడ్‌పార్కు భూములపై పడింది. సదరు మంత్రి తన సామాజికవర్గానికి చెందిన, అదీగాక ఆంధ్రాకు చెందిన ‘దీపక్ నెక్ట్స్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ యజమాని తెరమీదికి వ చ్చారు. బుగ్గుపాడు ఫుడ్‌పార్కులో తాను పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని, తనకు భూము లు కేటాయించాలని టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. 72 ఎకరాలు కేటాయిస్తే.. రూ.650 కోట్లతో చేపలు, రొయ్యల దాణా తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టుకు మరో పరిశ్రమ ఏర్పాటుచేస్తానంటూ అప్లికేషన్ పంపాడు.
సదరు సీనియర్ మంత్రి అండదండలున్న ఆంధ్రా కంపెనీ యజమాని అడుసుమిల్లి సుబ్రహ్మణ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరం కేవలం రూ.21 లక్షల చొప్పునే రూ.15.12 కోట్లకు 72 ఎకరాలను కట్టబెట్టింది. విష యం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం నుంచి సదరు ఆంధ్రా కంపెనీకి భూకేటాయింపులు జరుగకముందే.. ఈ భూమి పక నే ఉన్న ఓ రైతు నుంచి సదరు కంపెనీ ఎకరం భూమిని రూ.75 లక్షలకు కొనడం గమనా ర్హం. బుగ్గపాడు యూనిట్లో సదరు మంత్రి తనయుడు నిష్క్రియ భాగస్వామిగా ఉన్న ట్టు ఆరోపణలున్నాయి. అందువల్లే సదరు మంత్రి కీలకంగా వ్యవహరించి ఎకరం కేవ లం రూ.21 లక్షల చొప్పునే ఇప్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ భూముల్లో ఎకరానికి రూ.40.47 లక్ష ల చొప్పున టీజీఐఐసీ ఇప్పటికే ధర నిర్ధారించింది. కానీ, సదరు కంపెనీకి మాత్రం ఎకరం రూ.21 లక్షల చొప్పునే రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టింది.రెండేండ్లలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తే సదరు భూమి ఆ కంపెనీకి సొంతమవుతుందనే ఒప్పందం కూడా ఉన్నది. బుగ్గపాడు ఫుడ్‌పార్కులో ఎకరానికి ప్రభుత్వ ధర రూ.40.47 లక్షలు, బహిరంగ మార్కెట్లో రూ.75 లక్షలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఆంధ్రా కంపెనీ యజమానికి ఎకరం రూ.21 లక్షల చొప్పునే కేటాయించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
అగ్గువకే భూమిని దక్కించుకున్న ఆంధ్రా కంపెనీ.. బుగ్గపాడు ఫుడ్‌పార్కులో భూమి చదును పనులను మొదలుపెట్టింది. అక్కడున్న పెద్ద పెద్ద చెట్లను కూల్చుతూ ముందుకెళ్తున్నది. నిబంధలకు విరుద్ధంగా చెట్లను నేలమట్టం చేస్తున్నది. ఆ కలపనూ అమ్ముకున్నట్టు విమర్శలు ఉన్నాయి. అదీగాక, సమీపంలోనే.. సీతారామ ప్రాజెక్టు కాలువ డీప్‌కట్ నుంచి కూడా లారీల ద్వారా మట్టిని తరలించి ఫుడ్పార్కులోని తాను అగ్గువకే కొన్న భూములను చదును చేస్తున్నది. ఇదిలావుండగా.. తనకు సమాచారం లేకుండానే ఈ వ్యవహారం జరుగుతున్నదంటూ స్థానిక ఎమ్మెల్యే అసహనంతో ఉన్నట్టు సమాచారం.