హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ, మధ్య భారతానికి వ్యూహాత్మక జీవనాధారమైన ఖమ్మం-బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లైన్లుగా విస్తరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. హై-స్పీడ్ కారిడార్ల ద్వారా హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న రహదారిలో గణనీయమైన అభివృద్ధి ఉందని తెలిపారు. ఖమ్మం వెలుపల కొత్తగూడెం-భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల అనుసంధానం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది జీవనాడిలాంటిదని, ఒడిషాకు కూడా అనుసంధానం చేయొచ్చని సూచించారు. సింగరేణి బొగ్గు క్షేత్రాలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ప్రధాన పరిశ్రమలకు నిలయమైన కొత్తగూడెం-పాల్వంచ తెలంగాణ పారిశ్రామిక, ఇంధన వెన్నుముకగా ఉన్నట్టు వద్దిరాజు చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంలో రహదారుల మౌలిక వసతులు లేవని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నాలుగు లేన్ల కారిడార్ మూడు రాష్ర్టాల లాజిస్టిక్స్ కేంద్రంగా రూపుదాల్చి, రాష్ర్టాల మధ్య బొగ్గు, ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల నిరాటంక రవాణాను సులభతరం చేస్తాయని వివరించారు. ఈ రహదారి గిరిజన, వెనుకబడిన ప్రాంతాల గుండా వెళ్తుందని, దీంతో ఆ వర్గాలను ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కారిడార్‌తో హైదరాబాద్ నుంచి బస్తర్ అనుసంధాన్ని బలోపేతం చేయొచ్చని సూచించారు. ఇప్పటికే ఖమ్మం వరకు పటిష్ఠమైన కారిడార్లను నిర్మించామని, అత్యంత కీలకమైన ఈ అనుసంధాన్ని బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కారిడార్ ఆర్థిక, సామాజిక వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి, దీనిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.