సర్కార్ సైలెన్స్ సాస్.. బక్వాస్.. మియాపూర్‌లో బీరాలు.. ఖాజాగూడలో బేరాలా?
మియాపూ ర్లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వాని దేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక సార్లు సమర్థ వాదనలు వినిపించిన ఫలితమిది.
- సాస్ ఇన్ఫ్రాకు భూ ధారాదత్తంపై సర్కార్ మౌనం
- ఇప్పటిదాకా కౌంటర్ అఫిడవిట్ వేయని వైనం
- 3.17 ఎకరాలకు దారిలేదన్న బీసీ సంక్షేమ శాఖ
- ఇప్పటికీ 22ఏలో సర్కార్ భూమిగానే నమోదు
- ప్రభుత్వ వ్యవస్థల తరఫున సాస్ ఇన్ఫ్రా వకాల్తా
- ‘నమస్తే’ కథనాలపై కంపెనీ పత్రికా ప్రకటన
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మియాపూ ర్లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వాని దేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక సార్లు సమర్థ వాదనలు వినిపించిన ఫలితమిది. కానీ న్యాయ పోరాటం ద్వారా ఆ భూముల్ని తామే కాపాడినామంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముందు బీరాలు పలికా రు. మరి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వేనంబర్ 20/1లో రూ.680 కోట్ల విలువైన 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా అదే స్థాయి చిత్తశుద్ధి ఎందుకు లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భూభారతి మాడ్యూల్స్ ప్రకారం.. సాస్ ఇన్ఫ్రా కంపెనీ పేరిట ఈ భూ బదలాయింపు జరుగలేదని కలెక్టర్ 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టుకు వెళ్లడంతో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం లేదు.
ఓవైపు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చూపుతూ.. కోర్టు ముందు మాత్రం వాస్తవాలను చూపడం లేదు. బీఆర్ఎస్ న్యాయ పోరాటం ద్వారా మియాపూర్ భూములు దక్కితే తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కండ్ల ముందు సర్కార్ భూమిని ప్రైవేట్ కంపెనీ చేజిక్కించుకుంటే ఎందుకు న్యాయ పోరాటం చేయడంలేదు? అంటే తెర వెనుక ‘ముఖ్య’నేత ప్రధాన అనుచరుడు చక్రం తిప్పారనేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏంకావాలి? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కార్ మౌనాన్ని ఆసరాగా చేసుకొని సాస్ ఇన్ఫ్రా కంపెనీ అన్ని ప్రభుత్వ శాఖల తరపున వకాల్తా పుచ్చుకొని తప్పుడు వాదనలు వినిపిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై ఆ కంపెనీ యాజమాన్యం సుదీర్ఘమైన పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రభుత్వ భూమి ధారాదత్తం మొదలు తౌతోనికుంట ఆక్రమణ, రెరా ఉల్లంఘనల వరకూ తమపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదంటూ వాపోయింది. ఈ నేపథ్యంలో అసలు సాస్ ఇన్ఫ్రా కంపెనీ వాదనలు.. వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
‘సాస్’ ప్రకటనలోని వాదన
సాస్ ప్రకటన ప్రకారం.. ఖాజాగూడలోని సర్వేనంబర్ 20/2లోని 3.17 ఎకరాల భూమిపై 2015 నుంచి 2019 వరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం అనేక లేఖలు రాసింది. 2022లో అప్పటి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) 3.17 ఎకరాల భూమి పొరపాటున సర్కారీగా పడిందని, రికార్డులు సరి చేయాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాల భూమిని నోషనల్ ఖాతా, 22ఏ నుంచి తొలగించాలని సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌ను కోరారు. 11,974.4 చదరపు మీటర్ల నికర స్థలంలో భవన నిర్మాణానికి కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చారు. భూ యజమానులతో 2026లో సాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. 2026, జూలైలో అకస్మాత్తుగా అధికారులు ఈ భూమిని 22ఏలో సర్కారీగా నమోదు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. 23.7.2026న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ అంశం హైకోర్టు పరిధిలో ఉండగా దాని గురించి చర్చించడం సముచితం కాదు.
హైడ్రా తరపున సాస్ సుదీర్ఘ వాదనలు
పత్రికా ప్రకటనలో తౌతోనికుంటకు సంబంధించి కూడా సాస్ ఇన్ఫ్రా సుదీర్ఘమైన వాదనలు చేసింది. కాకపోతే హైడ్రా ఏం చేసింది? ఏం చేయాలనుకున్నది? అనే వివరాలను ఆ ప్రభుత్వ విభాగం తరఫున ఈ కంపెనీయే చెప్పింది. ముఖ్యంగా 2009లో అన్నిరకాల అనుమతులు, మాస్టర్‌ప్లాన్‌లో నమోదు చేసి చెరువు మధ్యలో వేసిన 24 మీటర్ల రోడ్డు వల్ల అక్కడ వరదలు వస్తున్నాయట. ఇప్పుడు దానిని తొలగించి, ప్రత్యేకంగా 30 మీటర్ల రోడ్డు వేయాలనేది హైడ్రా ఆలోచనగా సాస్ ఇన్ఫ్రా చెప్పింది. దాదాపు 17 ఏండ్ల కిందట వేసిన రోడ్డుతో ఇప్పుడు కొత్తగా వరదలు రావడమేంది? ఇన్నాళ్లూ లేని సమస్య ఇప్పుడు సాస్ ఇన్ఫ్రా పేరిట సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాలు బదలాయించిన తర్వాతే ఎందుకు వస్తున్నది? ఇంతకీ.. 60 ఫీట్ల రోడ్డు తొలగించి, వంద ఫీట్ల రోడ్డు ప్రణాళిక ఎవరి మేలు కోసం?
3.17 ఎకరాల భూమికి ఇప్పటిదాకా లేని రహదారి సౌకర్యాన్ని కల్పించడం కోసమేనా? పైగా సాస్ ఐటవర్ నిర్మించిన సర్వేనంబర్ 19లోని భూముల పాత రికార్డుల్లోని సరిహద్దుల్లో ఓవైపు తౌతోనికుంట అని స్పష్టంగా ఉన్నది. కానీ సాస్ ఐటవర్ నిర్మాణం తర్వాత సవరణ అనుమతులు (రివైజ్డ్ ప్లానింగ్ పర్మిషన్) తీసుకునే సమయంలో హఠాత్తుగా ఆ సరిహద్దు తౌతోనికుంటకు బదులుగా పట్టా భూమిగా ఎందుకు మారింది? అసలు సాస్ ఇన్ఫ్రా దృష్టిలో సర్వేనంబర్ 17లో చెరువు లేనేలేదు.. అలాంటప్పుడు తౌతోనికుంట మీద ఆ కంపెనీ ఎందుకు ప్రేమ ఒలకబోస్తున్నట్టు?! ఇదేకాదు.. 3.17 ఎకరాలకు అసలు దారి లేదని స్వయంగా బీసీ సంక్షేమ శాఖ గతంలో రెవెన్యూ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. కానీ సాస్ ఇన్ఫ్రా రిజిస్ట్రేషన్ శాఖలో జరిపిన లావాదేవీల్లో 100 ఫీట్ల రహదారి ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రా 2009లో వేసిన 60 ఫీట్ల రోడ్డును తొలగించి, 100 ఫీట్ల రహదారి వేయాలనుకుంటున్నదని సాస్ యాజమాన్యం చెప్తున్న రోడ్డు ఇదేనా?

గడువులోగా పూర్తయితే అద్దె ఎందుకు ఇస్తున్నట్టు?!
సాస్ ఇన్ఫ్రా యాజమాన్యం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చివరిగా.. నిర్మాణ అనుమతులు, రెరా, గడువు వంటి అంశాలను పేర్కొన్నది. అన్నిరకాల అనుమతులు, సవరణ అనుమతులు తీసుకున్నామని, హెచ్ఎండీఏ సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాతనే ఓసీ ఇచ్చిందని, రెరా పొడిగించిన గడువులోగానే నిర్మాణాలు పూర్తయినట్టు చెప్పింది. మరి ఇదే నిజమైతే.. కొనుగోలుదారులు (ఇన్వెస్టర్స్)కు యాజమాన్యం ఒప్పందంలోని షరతు మేరకు చదరపు అడుగుకు రూ.25 అద్దె ఎందుకు చెల్లిస్తున్నట్టు? 29.9.2026న టవర్-ఏ పూర్తయితే ఇప్పటివరకు కొనుగోలుదారులకు ఎందుకు స్వాధీనం చేయలేదు? ఆ కమర్షియల్ స్పేస్‌ను అద్దెకు తీసుకునేందుకు వస్తున్న వాళ్లు లిఫ్టులు, జనరేటర్లు, ఇతరత్రా సౌకర్యాలేవీ ఇంకా పూర్తి కాలేదంటూ ఎందుకు మరలిపోతున్నారు? కాగా అంతా సవ్యంగా ఉన్నదని సాస్ యాజమాన్యం చెప్తున్నది. అలాంటప్పుడు కొనుగోలుదారులు రెరా, హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? ముఖ్యంగా సాస్ యాజమాన్యం నిర్ణీత గడువులోగా నిర్మాణాల్ని పూర్తి చేయకుండా, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నదంటూ రెరా సుమోటోగా కేసు (208/2025) ఎందుకు నమోదు చేసింది? ఇప్పటికీ పలువురు కొనుగోలుదారులు వేసిన కేసులు రెరాలో పెండింగులోనే ఉన్నాయి కదా? వాటిపై రెరా చర్యలు తీసుకోకుండా సాస్ ఇన్ఫ్రాకు మాత్రం గడువు పొడిగించుకుంటూ మార్గం సుగమం చేయడం రెరా ఏర్పాటు ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని తుంగలో తొక్కుతున్నదనేది వాస్తవం కాదా?
‘సాస్’ చెప్పిందే పరిశీలిస్తే
ఇక సాస్ యాజమాన్యం నిబంధనల ప్రకారం వచ్చాయంటున్న సవరణ అనుమతులు, ఓసీలను లోతుగా పరిశీలిస్తే..
- సాస్ ఐటవర్కు జీ+37 అంతస్తులతో 3.4.2019న జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది.
- సాస్ కంపెనీ 2025, నవంబర్‌లో జీహెచ్ఎంసీకి సవరణ నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నది. 30.5.2026న జీహెచ్ఎంసీకి సుమారు రూ.15 కోట్ల జరిమానా చెల్లించింది. సవరణలకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) 24.6.2026న అనుమతి ఇచ్చింది. 18.8.2026న హెచ్ఎండీఏ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేసింది.
- అయితే రెరా చట్టం ప్రకారం సవరణ నిర్మాణ అనుమతులు తీసుకోవాలంటే కచ్చితంగా మూడింట రెండొంతుల కొనుగోలుదారుల అంగీకారం ఉండాలి. కానీ ఇక్కడ అదేమీ లేదు. సీఎంసీలోని సీసీపీ రెండు పత్రికల్లో ప్రకటన జారీ చేసి.. ఎలాంటి అభ్యంతరాలు రాలేదంటూ సవరణ నిర్మాణ అనుమతులు ఇచ్చారు. అంటే రెరా చట్టాన్ని తుంగలో తొక్కారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 5న జీవో 45 జారీ చేసింది. అందులో 2026, మార్చి ఒకటో తేదీ నుంచి పది అంతస్తులు దాటిన నిర్మాణాలకు హెచ్ఎండీఏ మాత్రమే నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేయాలని ఆదేశించింది. గతంలో దరఖాస్తు చేసి ఉన్నట్టయితే పాత సంస్థలే అనుమతులు, ఓసీలు ఇవ్వాలని సూచించింది. కానీ ఇక్కడ సాస్ కంపెనీ సవరణ అనుమతులకు నిరుడు నవంబర్‌లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయడంతో పాటు జరిమానా ఫీజు కూడా దానికే చెల్లించింది. అంటే జీవో 45 ప్రకారం జీహెచ్ఎంసీ మాత్రమే సాస్ ఐటవర్ సవరణ నిర్మాణ అనుమతులు, ఓసీ ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా సవరణ నిర్మాణ అనుమతులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఇస్తే.. హెచ్ఎండీఏ ఓసీ ఇచ్చింది.
ఈ ప్రశ్నలకు జవాబేది?
‘సాస్’ ఇన్ఫ్రా వాదనల ప్రకారం.. గతంలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా వ్యక్తుల పేరిట ఆ భూమి రాగా.. వారితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా స్పష్టమవుతున్నది. అంటే రెవెన్యూ రికార్డుల్లో సదరు ప్రైవేట్ వ్యక్తుల పేరిట మ్యుటేషన్, నాలా జరిగిన తర్వాత సాస్ ఇన్ఫ్రాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వాస్తవానికి ఏం జరిగింది?
- 13.4.2026న 3.17 ఎకరాల భూమిని భూసేకరణ కింద తీసుకున్నట్టుగా, అందులో ఇండ్ల స్థలాలు ఉన్నట్ట్లుగా చూపుతూ నోషనల్ ఖాతా నంబర్ 3000101 కింద నమోదు చేసినట్టుగా భూభారతి ఈసీలో స్పష్టంగా ఉన్నది. అంటే ఆ భూమి ఏ ప్రైవేట్ వ్యక్తి పేరిట రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ జరగడంగానీ నాలా మార్పుగానీ జరుగలేదని స్పష్టమవుతున్నది. అంతేకాదు.. గతంలో నోషనల్ ఖాతా నుంచి తొలగించాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే నోషనల్ కింద ఆ భూమిని చూపుతున్నారంటే ఆ ఉత్తర్వు అమలు కానట్టే కదా!
- సాస్ ఇన్ఫ్రా ప్రైవేట్ భూ యజమానులతో ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నది. అసలు ఎవరు ఆ యజమానులు? రెవెన్యూ రికార్డుల్లో వాళ్ల పేర్లపై భూమి ఎందుకు నమోదు కాలేదు? వాళ్లకు టైటిల్ (భూ యాజమాన్య హక్కు) సంక్రమించనప్పుడు సాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటుంది? ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు చెప్తుండగా ఈ ఏడాది జూన్ 15, 19 తేదీల్లో భూభారతి పోర్టల్‌లో నేరుగా స్లాట్స్ బుక్ చేసి సాస్ ఇన్ఫ్రా డైరెక్టర్ గూడె వెంకటేశ్వరరావు, సాస్ ఇన్ఫ్రా పేరుతో వ్యవసాయేతర భూమిగా (నాలా) మార్చిన లావాదేవీలు ఎలా నమోదయ్యాయి? భూ యజమానుల పేరిట కదా ఆ ప్రక్రియలు జరగాల్సింది? ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే భూ యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయా? అది సాధ్యం కానప్పుడు సాస్ ఇన్ఫ్రా పేరిట నాలా అనుమతులు ఎలా వచ్చాయి? పైగా 2023 లోనే సర్వేనంబర్ 20/1లో 11,974.4 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణానికి కలెక్టర్ జీహెచ్ఎంసీకి ఎన్వోసీ ఇచ్చినట్టు సాస్ ఇన్ఫ్రా చెప్తున్నది. 2023లోనే చదరపు మీటర్లు అంటే వ్యవసాయేతర భూమిగా మారినపుడు మళ్లీ నాలా అనుమతి ఎందుకు తీసుకున్నట్టు?
- ఈ ఏడాది జూలైలో అకస్మాత్తుగా ఈ భూమిని 22ఏ నిషేధిత జాబితాలో నమోదు చేశారని సాస్ ఇన్ఫ్రా చెప్తున్నది. కానీ నిరుడు నవంబరులోనే రంగారెడ్డి కలెక్టర్ (లేఖ నం.ఇ1/ 4482/2024, తేది: 11.11.2025) రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి పంపిన నిషేధిత జాబితాలో ఈ భూమిని సర్కారీగా పేర్కొన్నారు. ఆతర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. అలాంటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై సాస్ ఇన్ఫ్రా డైరెక్టర్ గూడె వెంకటేశ్వరరావు, సాస్ ఇన్ఫ్రా పేరిట నాలా అనుమతులు రావడం అక్రమం కాదా?
- హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు చర్చించవద్దని సాస్ ఇన్ఫ్రా చెప్తున్నది. ప్రభుత్వ వ్యవస్థల్లో అక్రమాలు జరిగినప్పుడు వాటిని వెలుగులోకి తీసుకురావడం పత్రికల సామాజిక బాధ్యత. పైగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో పిటిషనర్లపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి వాస్తవాలను న్యాయంస్థానం ముందు ఉంచాలి. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయడం లేదు. హైకోర్టు విచారణలో ఉన్నందున ఎవరూ నోరెత్తవద్దని సాస్ ఇన్ఫ్రా వాదిస్తున్నది. అంటే అక్రమాన్ని ఎత్తి చూపకుండా పత్రికలు కూడా ప్రేక్షకపాత్ర పోషించాలా?
- సర్వేనంబర్ 20/1 భూమికి సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. 2011లోనే ఈ భూమి తమదిగా వాదిస్తున్న దుద్దాల శ్రీహరి, దుద్దాల మురళి హైకోర్టును (డబ్ల్యూపీ నెం.17801/2011) ఆశ్రయించారు. ఈ సర్వేనంబర్‌లోని భూమి ప్రభుత్వానిదేనని అంగీకరిస్తూ తమకు అసైన్మెంట్ పట్టా మంజూరు చేయాలని కోరారు. ఆతర్వాత 2019లో మరో పిటిషన్ (14971/2019) వేసి అందులో ఆ భూమి పట్టా భూమి అని, ఆ మేరకు రికార్డులు సరిచేసేలా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించాలని కోరారు. దానిపై 2020 నవంబర్ 26న బీఆర్ఎస్ ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా కౌంటర్ దాఖలు చేయించింది. అది ప్రభుత్వ భూమి అని, ప్రైవేట్ వ్యక్తుల వాదనలు తప్పు అని న్యాయ పోరాటం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెలలు గడుస్తున్నా కౌంటర్ దాఖలు చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తుంటే ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అక్రమాలను వెలుగులోకి తీసుకురాకుండా హైకోర్టు విచారణలో ఉన్నదంటూ పత్రికలు సైతం మౌనంగా ఉండాలా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

