SLBC Project | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఎస్సెల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు, అధ్యయనాలు చేయకుండానే పనులు హడావుడిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది. కేవలం నిర్మాణ కంపెనీ అనామతు పరీక్షలతోనే పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. అందువల్లే ప్రమాదం జరిగిందని కార్మిక వర్గాలు, ఇంజినీర్లు, జియాలజిస్టులు వెల్లడించారు. డేంజర్ జోన్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలను కూడా ప్రభుత్వం, అధికారులు చేపట్టలేదని వివరిస్తున్నారు. పూర్తిగా కంపెనీ చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడంతోనే ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్న 14 కిలోమీటర్ల ప్రాంతం సున్నితమైందని, అత్యంత ప్రమాదకరమైందని ఇంజినీర్లు చెప్తున్నారు. దాదాపు 8 మీటర్ల మేరకు షియర్‌జోన్ ఉందని చెప్తున్నారు.
భూమి పొరల్లో భౌతిక ఒత్తిళ్లకు గురై, రాళ్లభాగాలు తేలికగా సర్దుబాటవడం, రాతి ఆకృతులు మారిపోవడం, చీలికలు ఏర్పడి పూర్తిగా పటుత్వాన్ని కోల్పోయే ప్రాంతాన్ని షియర్‌జోన్ అంటారని తెలిపారు. ఫలితంగా భూమి ప్రకంపనలకు గురవుతుంటుందని వివరించారు. సొరంగ నిర్మాణాల వైఫల్యాలకు ప్రధానంగా ఇలాంటి జోన్లే కారణంగా నిలుస్తాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ జోన్ ఉందని తెలుస్తున్నది. అలాంటి జోన్లలో సొరంగ నిర్మాణాలను చేపట్టే సమయంలోనే చాలా రకాలుగా అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో షియర్జోన్కు సంబంధించిన అధ్యయనాలు చేయలేదని స్థానిక సైట్ఇంజినీర్లు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నిర్మాణ కంపెనీ పరీక్షలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. నామమాత్రంగా జియాలజికల్ సర్వే మాత్రమే నిర్వహించారని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన చోటు నుంచి భారీగా సీపేజీ వస్తున్నదని, అందుకు అనుగుణంగా డీవాటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. భూమిపొరల్లో నీటి ఒత్తిడిని నివారించేందుకు సీపేజీ పరిమాణాన్ని బట్టి డ్రైనేజీ రంధ్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది చేయలేదని, అదీగాక చేసిన డ్రైనేజీ రంధ్రాలు కూడా పూడుకుపోకుండా కేసింగ్ వేయాల్సి ఉంటుంది.
ఆ పని కూడా చేయలేదని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. షీర్జోన్కు అనుకూలమైన రీతిలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన విధానంలో గ్రౌటింగ్ చేయాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. ఆయా పరీక్షలు, నిపుణుల ఆధ్వర్యంలో లోతైన అధ్యయనాలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని, ఆ ఖర్చును తప్పించుకునేందుకు కంపెనీ నామమాత్రపు పరీక్షలను నిర్వహించి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కార్మికులు, ఇంజినీర్లు విమర్శిస్తున్నారు.
పటిష్ట రక్షణ చర్యలు, గ్రౌటింగ్ నిర్వహించకుండా పనులు చేయడం వల్లే మట్టి, సిమెంట్ కుప్పులు కూలిపోయాయని వివరిస్తున్నారు. నిర్మాణ వైఫల్యానికి, ప్రస్తుత ప్రమాదానికి ప్రధానంగా కనీస పరీక్షలు, అధ్యయనం చేయకుండా పనులను చేపట్టడమే కారణమని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అత్యంత ఆర్భాటంగా చేపట్టిన సొరంగ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిపుణులను ఏర్పాటు చేయలేదని, పూర్తిగా కంపెనీకే వదిలేసిందని వివరిస్తున్నారు. సంక్లిష్ట సొరంగ నిర్మాణ పనులకు సంబంధించి నిపుణులను నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని తెలుపుతున్నారు.
సెస్మిక్ టోమోగ్రఫీ భూమిలోని రాళ్ల దృఢతను అంచనా వేయడం
గ్రావిటీ సర్వే భూమి పొరల్లోని మార్పులను అర్థం చేసుకోవడం
మ్యాగ్నెటిక్ సర్వే భూమి ఉష్ణోగ్రతలతో వాటిల్లే మార్పులను గుర్తించడం
రెసిస్టివిటీ టెస్టింగ్ భూమిలోని నీటి నిక్షేపాలు, ప్రవాహారీతులు తెలుసుకోవడం
స్ట్రెయిన్ గేజ్భూపొరల్లో ఒత్తిడిని ట్రాక్ చేయడం
బోర్‌హోల్స్ సర్వేలు భౌగోళిక నమూనాపై సమాచారం సేకరించడం