ఇచ్చోడ, అక్టోబర్ 3 : ‘ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మళ్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లా.. రాసుకోరా బిడ్డ ఇది కేసీఆర్ అడ్డా, ‘దేఖ్లెంగే’ ‘గుర్తుల గుర్తించుకో రామక’ అనే పాటలపై గురువారం సాయంత్రం దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలో కేసీఆర్ పాటలపై ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కేసీఆర్ సారు పాలన లేక, సంక్షేమ పథకాలు అందక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సారే రావాలని ఆకాంక్షించారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, మహిళలు, గ్రామస్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దిస్ ఈజ్ సూపర్బ్ అంటూ మహిళలను చప్పట్లతో ప్రశంసించారు.