హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మాగంటి ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని, ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించుకున్నారని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. మాగంటిని కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఏపీ మంత్రి నారా లోకేశ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సినీనటుడు మురళీ మోహన్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తదితరులు సంతాపం తెలిపారు.
బీఆర్ఎస్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి తన సోదరుడి లాంటివాడని, మృధుస్వభావి అని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, మంచి నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధకరమని వాపోయారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన మాగంటి.. రాజకీయాల్లో హూందాతనానికి మారుపేరుగా నిలిచారని చెప్పారు. మాగంటి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. మాగంటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మాగంటి జీవితం ఆదర్శనీయమని, గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
మాగంటి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. శోక తప్తులైన మాగంటి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి.
– ఎమ్మెల్సీ కవిత
మాగంటి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ ప్రజానేతగా ఎదిగారు. అలాంటి సహచర ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరం. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి.
– శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి
ఎమ్మెల్యే మాగంటి మృతి చాలా బాధాకరం. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా..
– తలసాని, మాజీ మంత్రి
మంచి మిత్రుడిని కోల్పోయాం, ప్రజాతీర్పుతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో మాగంటి చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు గోపీనాథ్.
– నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ
బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి హైదరాబాద్ నగర ప్రజలకు, పార్టీకి తీరని లోటు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి.. ప్రజా ప్రయోజనాల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి మాగంటి. 42 ఏండ్లుగా ఆయనతో స్నేహాన్ని కొనసాగిస్తున్నా. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇకడి నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడమే ఆయన సేవాగుణానికి తార్కాణం.
-మధుసూదనాచారి, మండలిలో ప్రతిపక్షనేత
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలి.
– డాక్టర్ బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్
మాగంటి అకింత భావంతో ప్రజాసేవ చేశారు. బీఆర్ఎస్ కోసం నిబద్ధతతో ఆయన చేసిన కృషి చిరకాలం నిలిచిపోతుంది. ఇంతటి కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలి.
– దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ