Singareni | హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేండ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఖనిజ సంపదను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పావులు కదుపుతున్నది. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుంటే తామే వేలం వేస్తామంటూ కేంద్రం స్పష్టం చేసింది. తాము ఇప్పటికే నిర్దేశించిన 11 బ్లాకుల్లో కనీసం ఆరింటినైనా వేలం వేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వేలం ప్రక్రియను చేపట్టేందుకు గనుల శాఖ సిద్ధమవుతున్నది. వివిధ ఖనిజాలకు సంబంధించి 11 బ్లాక్‌లను వేలం వేయాలని కేంద్రం అనేకమార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తలొగ్గలేదు. రాష్ట్రంలోని అత్యంత విలువైన ఖనిజ సంపదను కాపాడి, భవిష్యత్తు తరాలకు అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ఇందుకు ఒప్పుకోలేదు.
వాస్తవానికి దేశంలో వేలం ద్వారా గనుల కేటాయింపు ప్రక్రియ 2015 నుంచి ప్రారంభమైంది. నూతన మైనింగ్ నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా 354 బ్లాకులకు వేలం నిర్వహించగా, ఇందులో 48 మినరల్ బ్లాక్‌ల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 11 బ్లాక్‌లను వేలం వేయాలని గత తొమ్మిదేండ్లుగా కేంద్రం ఒత్తిడి తెస్తున్నప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ 11 బ్లాకుల్లో కనీసం ఆరు బ్లాకులను ఈ నెలాఖరులోగా వేలం వేయాలని, లేనిపక్షంలో తామే వేలం ప్రక్రియను చేపడతామని తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. తాము అనేకసార్లు కోరినప్పటికీ గడచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క బ్లాక్‌ను కూడా వేలం వేయలేదని ఆ లేఖలో పేర్కొన్నది. తెలంగాణలోని ఐదు ఇనుప, ఐదు సున్నపురాయి, ఒక మాంగనీసు గని బ్లాకులను వేలం వేయాలని కేంద్రం కోరుతున్నది.