
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికంగా గౌరవ వేతనాలు అందుతున్నాయి. స్థానిక సంస్థలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వాటిని బలోపేతం చేయడంతోపాటు, ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలు గౌరవప్రదంగా ఉండే విధంగా నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటికి రెండుసార్లు గౌరవవేతనాలు పెరిగాయి. మొదటిసారి 2015, జూన్ 24న, తిరిగి గత జూలైలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం గౌరవవేతనాలను పెంచారు. దీంతో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు అత్యధికంగా గౌరవవేతనాలు పొందుతున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు కేటాయించింది. వీటిలో మండల పరిషత్‌లకు రూ.248.75 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.251.25 కోట్లు కేటాయించారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు 14వ ఆర్థిక సంఘంలో కేంద్రం నిధులు కేటాయించలేదు. దీంతో ఆ సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే దిక్కయ్యాయి.15వ ఆర్థిక సంఘం నిధుల్లో జిల్లా పరిషత్‌లకు ఐదు శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం నిధులను కేటాయించారు. మిగిలిన 85 శాతం గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘంలో పంచాయతీలకు మాత్రమే నిధులు విడుదల చేసేవారు.
