హుజూరాబాద్, జనవరి 5 : ‘తెలంగాణలో మళ్లీ మీరే రావాలి.. హుజూరాబాద్‌కు మళ్లీ మీరే కావాలి’ అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు తాటిపాముల రమేశ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. 41 రోజులపాటు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్న ఆయన, శబరిమల యాత్రలో భాగంగా పంబా నుంచి సన్నిధానం వరకు ఇరుముడితో పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడి కౌశిక్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఫ్లెక్సీ పట్టుకుని కొండపై ప్రదర్శించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. భక్తితోపాటు కేసీఆర్, కౌశిక్‌రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్న రమేశ్‌ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.