గజ్వేల్, జూన్ 11 : పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట భారీ కాన్వాయ్ తరలివెళ్లింది. కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్తారన్న సమాచారంతో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఎర్రవల్లిలోని ఆయన ఇంటికి భారీ ఎత్తున వాహనాలతో తరలివచ్చారు. ఎర్రవల్లిలోని ఇంటి నుంచి బయలుదేరిన వాహనశ్రేణి మర్కూక్, గౌరారం, ములుగు, వంటిమామిడి మీదుగా భారీ కాన్వాయ్‌తో వెళ్లింది. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లే రాజీవ్ రహదారి వెంబడి పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
కేసీఆర్ కాన్వాయ్ వెంబడి మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సంతోష్‌రావు, గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు తరలివెళ్లారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, మర్కూక్, ములుగు, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాల నుంచి బీఆర్కే భవన్‌కు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లాయి.