హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పేదింటి ఆడబిడ్డలకు సంక్షేమ ప్రభుత్వమే అమ్మగారిల్లుగా మారింది. మహిళలకు పెద్దన్నలా.. చిన్నారులకు మేనమామలా పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మి పథకంతో చిన్నారులకు, గర్భిణిలకు పౌష్ఠికాహారం అందిస్తున్నారు. కేసీఆర్ కిట్‌తో శిశుమరణాల రేటు తగ్గడమే కాదు..ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 35 నుంచి 56 శాతానికి పెరగడం అద్భుత ఫలితంగా చెప్పొచ్చు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పూర్తి వివరాలు సభకు సమర్పించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల ద్వారా 2014 నుంచి 2021 వరకు 12.53 లక్షల మంది లబ్ధిపొందారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 35 నుంచి 56 శాతానికి పెరిగాయి. శిశు మరణాల రేటు తగ్గింది. గతంలో ప్రతి వెయ్యి మందికి శిశు మరణాల రేటు 36 ఉండగా ప్రస్తుతం 26కు తగ్గింది. ప్రసూతి మరణాలు గతంలో లక్షకు 90 ఉండగా ప్రస్తుతం 63కు తగ్గాయి.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నది. 2014 వరకు 56 శాతం అంగన్ వాడీలలో ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. ప్రస్తుతం ప్రభుత్వం 100 శాతం కేంద్రాల్లో గుడ్డు, పాలతో పౌష్టికాహార భోజనం అందజేస్తున్నది. ఇందుకు రూ.750 కోట్ల ఖర్చు
చేస్తున్నది.
గర్భిణిలను దవాఖానలకు తరలించడానికి 300 అమ్మ ఒడి వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటివరకు 11.08 లక్షల మంది అమ్మ ఒడి వాహనాల సేవలు పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. ఈ పథకం కింద 2017 నుంచి 2021 వరకు మొత్తం 3 కోట్ల 85 లక్షల చీరలను పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.1,466 కోట్లు ఖర్చు చేసింది.
మహిళల రక్షణ కోసం 331 షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందజేస్తున్నది. ఈ పథకం వల్ల లక్ష 32 వేల 238 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకురూ.320 కోట్లు ఖర్చు చేసింది.