Chennamaneni Hanumantha rao | విశాలాంధ్రలో ప్రజారాజ్యం కలలన్నీ కల్లలైన వేళ కలంపట్టి కన్నీటి సిరాతో ప్రజల కష్టాలను అక్షరాల్లో ఒంపి ‘లెటర్ టు ఎడిటర్ ఆన్ తెలంగాణ’లో మన గోసను దేశానికి చాటిన ఆర్థిక వేత్త డాక్టర్ చెన్నమనేని హనుమంతరావు విజన్ ఉన్న లీడర్ పాలకుడైతే ప్రగతి ఎంతటి పరుగు అందుకుంటుందో లెకలేసి మరీ చెబుతున్నారు. ప్రణాళికా సంఘ సభ్యుడిగా ప్రభుత్వాలకు పాలసీలు రూపొందించటంతో పాటు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్‌గా ఎన్నో పరిశోధనా పత్రాలు రాశారు. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రగతి గురించి పద్మభూషణ్ డాక్టర్ చెన్నమనేని హనుమంతరావుతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
విశాలాంధ్ర నుంచి ప్రత్యేక తెలంగాణకు జై కొట్టాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి?
ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నేను 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం చురుగ్గా పని చేశాను. 1969 నాటికి మాలాంటి వాళ్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్రం విడిపోవాలనే భావన పెరిగింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. అప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను. ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడానికి హైదరాబాద్ వచ్చాను. ఆనాటి సభల్లో నేనూ పాల్గొన్నాను.
‘ఎ లెటర్ టు ఎడిటర్ ఆన్ తెలంగాణ’లో ఏం రాశారు?
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ దేశానికి తెలియజేయాలనుకున్నాను. నేషనల్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్మెన్కి వ్యాసాలు రాశాను. ‘ఎ లెటర్ టు ఎడిటర్ ఆన్ తెలంగాణ’ పేరుతో 15 జూలై 1969లో ఆ పత్రికల్లో అచ్చయ్యింది. ‘ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఒకటిన్నర దశాబ్దం తర్వాత తెలంగాణను సందర్శిస్తే.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు,వివిధ వర్గాల కష్టాలు, నష్టాలు చూసిన వాళ్లెవరైనా నిర్ఘాంతపోతారు’ అని రాశాను. ఒక ఆర్థికవేత్తగా చిన్న రాష్ట్రాలే అభివృద్ధికి అనుకూలమనే భావనకు వచ్చాను.
‘నాగార్జున సాగర్ అభివృద్ధి సదస్సు’ తెలంగాణ ప్రగతి కోసం మీ సూచనలేమిటి?
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి అభివృద్ధిని చేపట్టాలో దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని నాగార్జున సాగర్‌లో 2015 మే 2న ‘మేజర్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ టు తెలంగాణ స్టేట్’ పేరుతో సదస్సు జరిగింది. అందులో ప్రారంభోపన్యాసం చేయాలని కేసీఆర్ గారు ఆహ్వానించారు. అరవై ఏండ్లలో తెలంగాణ అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలి. అందుకు వ్యవసాయం, సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాను. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పాలనలో వికేంద్రీకరణ, పంచాయతీల అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక అభివృద్ధి, పట్టణాభివృద్ధి ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలని చెప్పాను.
మీ సూచనలు అమలులోకి వచ్చాయా?
తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాల్లో ఆ అభివృద్ధి వ్యూహం కనిపించింది. పాలన వికేంద్రీకరణ జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తండాలు, ఆదివాసీ గూడేలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గ్రామాల్లో స్వయం పాలన, మౌలిక వసతుల కల్పన పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి.
తెలంగాణలో వ్యవసాయ రంగం ఇప్పుడెలా ఉంది?
తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడింది. తెలంగాణ వచ్చే నాటికి కరువు, అప్పులు, ఆత్మహత్యలతో తెలంగాణ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. తెలంగాణలో 46 వేల చెరువులు, కుంటల పునరుద్ధరణ, పరిరక్షణను కేసీఆర్ ఒక ఉద్యమంలా చేపట్టారు. మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. సాగునీరు, ఉచిత విద్యుత్‌తో వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడ్డాం.
తెలంగాణ ఆర్థిక ప్రగతి పుంజుకోవడానికి ప్రధాన కారణం?
స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు కన్నా తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీ ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రేటు ఎకువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ ప్రజల తలసరి ఆదాయం 1.70 లక్షల రూపాయలుగా ఉంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 3.17 లక్షల రూపాయలు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది.
మిషన్ కాకతీయ, కాళేశ్వరం తెచ్చిన మార్పులు చూశారా?
వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ చోదకశక్తిగా పని చేసింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు సాయంతో రైతులకు ఆర్థిక భారం తగ్గింది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది. ఆర్థిక అభివృద్ధితో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2021లో 352 మందికి ఆ సంఖ్య తగ్గింది.
అభివృద్ధిలో ఇంత వేగానికి కారణం ఏమిటి?
కొత్త రాష్ర్టానికి పాలనా సమస్యలు సాధారణంగా ఉంటాయి. తెలంగాణలో పాలనను చకదిద్దుకుంటున్న సందర్భంలోనే ఆలస్యం చేయకుండా అభివృద్ధి, సంక్షేమం గురించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దృష్టి సారించారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధులు, కేటాయింపులతోపాటు అభివృద్ధి వ్యూహం కూడా ఉండాలి. స్థానిక వనరులు, నిధులు, భవిష్యత్ లక్ష్యాలను బట్టి ఈ వ్యూహం అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2015 తర్వాత 19,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కొత్తగా ఉత్పత్తి, సేవలు ప్రారంభించాయి. వీటిలో 3.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సులభ తరహాలో వ్యాపార అనుమతుల కోసం టీఎస్-ఐపాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల పెద్ద మొత్తంలో వచ్చిన పరిశ్రమలు, సంస్థల్లో 73,000 కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. తెలంగాణలో ఏడేళ్ల నుంచి ఐటీ సేవల ఎగుమతులు ఏటా 15.7శాతం పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల వల్లే ఐటీ ఉద్యోగాల సంఖ్య 7.7 లక్షలకు చేరింది.
అభివృద్ధి సూచీల్లో అగ్రస్థానం..
ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధులు, కేటాయింపులతోపాటు అభివృద్ధి వ్యూహం కూడా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పాలనలో వికేంద్రీకరణ, పంచాయతీల అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించాను. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కనిపించాయి. పాలన వికేంద్రీకరణ జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తండాలు, ఆదివాసీ గూడేలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గ్రామాల్లో స్వయం పాలన, మౌలిక వసతుల కల్పన పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి వచ్చిన నాయకత్వం, ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి పట్ల సరైన విజన్ ఉంది. అభివృద్ధి సాధనలో కేసీఆర్ అంకిత భావంతో కృషి చేశారు. నేడు తెలంగాణ వివిధ అభివృద్ధి సూచీల్లో అగ్రస్థానంలో నిలిచింది.