హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర కల సాకారానికి కెప్టెన్ కేసీఆరే. తెలంగాణ పునర్నిర్మాణానికి బంగారు బాటలు వేసింది కూడా కేసీఆరే. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్‌కు విడదీయలేని బంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో తనను అక్కున చేర్చుకున్న వరంగల్‌ను స్వరాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ అంతే గౌరవించారు.
నాయకులకు పదవులు ఇవ్వటంలో, పథకాల రూపకల్పనలో, సర్కారు రాజముద్రలోనూ కేసీఆర్ వరంగల్‌కు సమున్నత అవకాశం ఇచ్చి గౌరవించారు. ఆదివారం రోడ్ షో సందర్భంగా కేసీఆర్‌ను కండ్లనిండా చూసినపుడు ఓరుగల్లు పులకించిపోయింది. 2001 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్‌కు విడిదినిచ్చే కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటిలోని గది అంతగానే పరవశించింది.
2001 జూన్ 21న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభకు కేసీఆర్ హాజరైనప్పటి నుంచి ఇప్పటి దాకా కేసీఆర్ ఆ గదిలో జరిపిన చర్చలు, సమాలోచనలు, కేసీఆర్ నడిపిన సమరాంగణంలో భాగస్వాములైన మేధావులు, బుద్ధిజీవులు, పార్టీ ముఖ్యులు ఎంతోమందికి ఆ గది ప్రత్యక్షసాక్షి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ అదే ఇల్లు ఆయనకు విడిది విశాలకేంద్రం.
సర్కారు అతిథి గృహాలు, ఆతిథ్యాలకు నెలవైన వందల ఇండ్లు ఎన్ని ఉన్నా కేసీఆర్‌కు ఆప్యాయతలను పంచిన కెప్టెన్ ఇల్లే వరంగల్ చిరునామా. మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ఒక గది, హాల్ ప్రత్యేకంగా ఉంటాయి. ‘కేసీఆర్ సర్ హాల్.. కేసీఆర్ సర్ బెడ్రూం’ అని ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రెండు చోట్లా ఫోన్లు ఉంటాయి. ‘2001లో వరంగల్‌లో మీటింగ్ అయినప్పటి నుంచి సార్.. ఎప్పుడొచ్చినా ఇంట్లోనే ఉంటారు.
రోజూ శుభ్రం చేయటం తప్ప వాటిని వాడుకోము. అత్యవసరం అయితే తప్ప (ఏడాదికి ఒక్కసారో రెండు సార్లో తప్ప) హాల్‌ను వాడతాం. కానీ సార్ చర్చలు జరిపిన హాల్‌ను ఎవరం వాడం. సార్ చెయిర్.. అటూ ఇటూగా ఉండే సీట్లను రోజూ శుభ్రం చేసి ఉంచుతాం’ అని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ పేర్కొనడం విశేషం. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేసీఆర్ హన్మకొండ రోడ్‌షోలో ప్రసంగించారు. వరంగల్ మట్టికి తనకు ఉన్న ఉద్యమబంధాన్ని నెమరువేసుకున్నారు. ఓరుగల్లు పోరుచైతన్యాన్ని చాటిచెప్పారు. అనంతరం కెప్టెన్ ఇంటికి చేరుకున్నారు.
దేశంలోనే తొలిసారి ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చాం. బీజేపీ సర్కారు మా బిడ్డను జైలులో పెట్టింది. అయినా భయపడలేదు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించి గెలిపించండి.
– కేసీఆర్