నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 25: దేశానికి కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు వస్తాయని, మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి కలిపి 20 సీట్లే గతి అని పేర్కొన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ఈడీ, సీబీఐతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.