సంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. నారాయణఖేడ్‌ను సస్యశ్యామలంగా మార్చేందుకు కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణం కోసం కేసీఆర్ సర్కార్ నిధులు మంజూరు చేయటంతోపాటు పనులు ప్రారంభించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో రైతుల సాగునీటి కలకు గండిపడింది. పనులు నిలిపివేయటంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎత్తిపోతలను పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని నిరుడు హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం తీవ్రంగా స్పందించారు. ఎత్తిపోతల పథకం కోసం పాదయాత్ర చేస్తామని తేల్చిచెప్పడంతో ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరి లో సంప్ నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ కొద్దిరోజులకే పనులను నిలిపివేసింది.
నాడు కరువు నేలలో సాగునీటి పరుగులు
నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి, కరువు ప్రాంతంగా పేరుండేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టిసారించి కరువు కోరల్లో నుంచి బయటకు తీసుకువచ్చా రు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పంటపొలాలకు సాగునీరు అందించింది. రూ.100 కోట్లతో 289 చెరువులను పు నరుద్ధరించింది. ఫలితంగా చెరువుల కింద 12వేల ఎకరాలున్న ఆయకట్టు 18,258 ఎకరాలకు పెరిగింది. కొత్తగా మూడు చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. నల్లవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి కాలువలు పునరుద్ధరించింది. కాళేశ్వరం 19వ ప్యాకేజీ ద్వారా రూ.762 కోట్లతో కాల్వల పనులు చేపట్టి 27,370 ఎకరాలు, ప్యాకేజీ 19ఏ ద్వారా 11,902 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నది.
బసవేశ్వరకు శ్రీకారం చుట్టిన కేసీఆర్
నారాయణఖేడ్‌ను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1.31 లక్షల ఎకరాలు, అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 34 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. ఇందుకోసం రూ.1,774 కోట్లు కేటాయించారు. దీనికి 2022 ఫిబ్రవరి 21న కేసీఆర్ నారాయణఖేడ్‌లో శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రి హరీశ్‌రావు బోరంచలో సంప్ పనులే ప్రారంభించారు. భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని సింగూర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చి.. బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోసి కాలువ లు ద్వారా సాగునీరు అందేలా డిజైన్ చేసింది.
కరువు ప్రాంతంగా మార్చే కుట్ర
నారాయణఖేడ్‌ను మళ్లీ కరువు ప్రాంతంగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్న ది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఇందుకోసం నిధులు మంజూరు చేశారు. మనూరు మండలం బోరంచలో సంప్ పనులు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పథకం పనులను పూర్తిగా నిలిపివేసింది. రాజకీయాలు మాని వెంటనే పనులు ప్రారంభించాలి. లేదంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుంది.
– ఎం భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే