(గోపాల్-హనుమకొండ) : సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి సాధించిన ఉద్యమనేత కేసీఆర్.. పరిపాలనలో ఇదే విధానాన్ని అమలుచేశారు. 13 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎదురైన అనేక అనుభవాలు, ప్రజల కష్టాల ను స్వయంగా చూసిన అనుభవంతో సరికొత్త పాలనా విధానాలను రూపొందించారు. ఈ క్రమంలో పేద వర్గాల కోసం విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అందుకే ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సాధించిన ప్రగతి.. దేశానికే దిక్సూచిగా నిలిచింది. అమలు చేసిన సంక్షేమం ఆదర్శమైంది. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశ పరిపాలనా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచాయి. దళితులకు ఆర్థిక వివక్షతోపాటు సామాజిక వివక్ష అదనపు భారమని ఈ విధానం పోవాలని పలుమార్లు కేసీఆర్ ఉద్ఘాటించారు. స్వతంత్ర భారతంలోనూ ఈ వివక్ష కొనసాగడం అత్యంత హేయమైన చర్యగా భావించి ఎస్సీ కులాలకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుచేశారు. సామాజిక వివక్ష నుంచి దూరం చేయడంతోపాటు, ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపట్టి ‘దళితబంధు’వుగా కీర్తికెక్కారు.
సామాజిక వివక్ష నుంచి వికాసం వైపు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎంతో గొప్పగా అమలుచేస్తున్నట్టు చెప్పినప్పటికీ ఈ వర్గాల్లో వెనుకబాటుతనం, పేదరికం పోలేదు. రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక నిధులు, సబ్ ప్లాన్లు తదితర సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామని చెప్తున్నా.. వారి బతుకుల్లో మౌలిక మార్పు రావడం లేదు. వారి సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి పెద్దపీట వేసింది. విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా నిలదొకుకొనేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇతర వర్గాల కోసం అమలుచేస్తున్న అన్ని పథకాలతోపాటు వారి కోసం ప్రత్యేకంగా అందిస్తూనే, రాజకీయంగానూ అవకాశాలు కల్పించింది.
దశాదిశ మార్చిన దళితబంధు
తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాలకు ఆర్థిక, సామాజిక గౌరవాన్ని పెంపొందించే దిశగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలుచేసింది. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీగానీ, సెక్యూరిటీగానీ లేకుండా లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వమే రూ.10లక్షల గ్రాంటును ఉచితంగా అందజేసింది. దళితులను స్వయం సమృద్ధులుగా, వ్యాపార వర్గాలుగా తీర్చిదిద్దేందు కు చర్యలు చేపట్టింది. అర్హత ఉన్న 38,323 కుటుంబాలను గుర్తించి రూ.3,832.30 కోట్లను ఈ పథకం ద్వారా పంపిణీ చేసింది.
సంక్షేమ రంగంలో దేశానికి కొత్త దిశను చూపేలా సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 15న హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆసక్తి ఉన్న ఏ రంగంలో అయినా స్థిరపడేలా వారికి అవకాశం కల్పించింది. ఫలితంగా వ్యవసాయ కూలీగా పనిచేసే కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్‌ను బర్ల డెయిరీకి యజమానిని చేసిందీ పథకం. ఇదే మండలం కన్నూరుకు చెందిన కనకం రవీందర్ తనకు అనుభవం ఉన్న రంగంలోనే స్థిరపడేందుకు దళితబంధు నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కును అందుకున్న కమలాపూర్‌కు చెందిన మాట్ల సుభాష్ సెంట్రింగ్ కూలీ నుంచి ఓనర్‌గా మారాడు. ఇలా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా సాధికారత సాధించేలా పథకం అమలవుతున్నది. తొలిదశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించి 2023-24 బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రతిపాదించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం పరిస్థితిని తారుమారు చేసింది.

తెలంగాణ సచివాలయానికి అంబేదర్ పేరు
కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అంబేదర్ మహాశయుని పేరును సెక్రటేరియట్‌కు పెట్టడంతో పాలనలో దేశానికి ప్రేరణగా నిలుస్తుందని కేసీఆర్ భావించారు. 2019 జూన్ 27న కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. 26 నెలల రికార్డు సమయంలో నిర్మాణం పూర్తయ్యింది. 28 ఎకరాల ఆవరణలోని 2.5 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’గా అప్పటి సీఎం కేసీఆర్ పేరు పెట్టారు. 2023 ఏప్రిల్ 30న ప్రారంభించారు.
అంబేదర్ భవనాలు, విగ్రహాలు
దళితుల అభ్యున్నతి చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 మార్చి నాటికి రూ.140 కోట్ల ఖర్చుతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు నిర్మించింది. భవన్లు, విగ్రహాల ఏర్పాటుకు రూ.368.27 కోట్లు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రికార్డు స్థాయిలో 86శాతానికి పైగా నిధులను ఖర్చు చేసి నిర్మాణ పనులను పూర్తిచేసింది.
దళితులకు మూడెకరాల భూమి
భూమిలేని వ్యవసాయ కుటుంబాలైన పేద ఎస్సీ మహిళా లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో ఒక పంట సంవత్సరానికి పంట సాయంతోపాటు 3 ఎకరాల భూమిని అందించే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని రూపొందించింది. 17,097.09 ఎకరాలను కొనుగోలు చేసి 6,998మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.769.17 కోట్లను ఖర్చు చేసింది.
ఎస్సీఎస్డీఎఫ్ రూ.92,640.41
షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధి(ఎస్సీఎస్డీఎఫ్) చట్టాన్ని అమలు చేసింది. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించింది. ఎస్సీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చుకాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తరువాత సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు జరిగేలా నిబంధనలు తెచ్చి పథకం కింద 2014-15 నుంచి 2022-23 వరకు రూ.92,640.41 కోట్లను ఖర్చు చేసింది.
ఆర్థిక చేయూత పథకం
దళిత కుటుంబాల స్వయంఉపాధి కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత పథకం ద్వారా వారికి అందించిన లక్ష రూపాయల నుంచి రూ.12లక్షల వరకు లోన్‌ను అనుసరించి 60% నుంచి 80% వరకు రాయితీని ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ పథకం కింద 2014-15 నుంచి 2022-23 వరకు 1,62,444 మంది లబ్ధిదారులకు రూ.2029.78 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది.
కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు
ఎస్సీ అమ్మాయి లేదా అబ్బాయిని ఇతర కులం అబ్బాయి లేదా అమ్మాయి పెండ్లి చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సా యం అందిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆ జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. 2014 నుంచి 2023 వరకు 6,315 జంటల కులాంతర వివాహాలకు ప్రోత్సాహకంగా రూ.60.80 కోట్లను అందజేసింది.
విద్యాభివృద్ధికి పెద్దపీట
తరతరాలుగా విద్యకు దూరంగా ఉంటూ వచ్చిన ఎస్సీ కులాలకు నాణ్యమైన విద్య అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాల సాధన దిశగా దేశానికే ఆద ర్శంగా ఎస్సీ గురుకులాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందించింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో అడ్మిషన్లు సాధించి డాక్టర్లు, ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనర్లుగా విజయతీరాలకు చేరారు. కేసీఆర్ హయాంలో 6,11,716 మంది విద్యార్థులకు హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.1976.91 కోట్లను ఖర్చు చేశారు.
104 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎస్సీ వర్గాలకు ప్రభుత్వ తరఫున విద్యనందించే పరిస్థితి దయనీయంగా ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 132 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కొత్తగా 104 పాఠశాలలను స్థాపించారు. మొత్తం ఎస్సీ గురుకుల పాఠశాలల సంఖ్య 236కు పెరిగింది. వీటిలో 1,13,280 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరిగేది. 5,428 మంది టీచర్లు పని చేసేవారు.
126 ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో 112 ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కొత్తగా 126 కాలేజీలను ఏర్పాటు చేశారు. మొత్తం కాలేజీల సంఖ్య 238కి చేరుకున్నది. వీటిలో 38,389 విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో బోధన అందేది.
స్టడీ సరిళ్లు
ఎస్సీ కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడంతోపాటు పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయిం చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబా ద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో కొత్తగా ఎస్సీ స్టడీ సరిళ్లు ఏర్పాటుచేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించింది. వీటిలో కోచింగ్ తీసుకున్న 1,314 మంది వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు.

అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్
దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వినూత్న పథకం తెచ్చింది. అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్ కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ పథకం కింద లబ్ధి పొందే వార్షిక ఆదాయ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఈ పథకంతో విద్యార్థులకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా దేశాలకు వెళ్లే వెసులుబాటు దక్కింది. 2013-23 వరకు 1,031 మంది అభ్యర్థులు రూ.179.92 కోట్లను సాలర్షిప్ కింద అందుకున్నారు.
ఎస్సీలకు నైపుణ్య శిక్షణ
దళిత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూ.91.83 కోట్లు ఖర్చు చేసి 21,653 మందికి శిక్షణ ఇప్పించి వారికి టీసీఎస్, కాగ్నిజెంట్, డెల్, సిసో, జెన్ పాక్ట్, డెలాయిట్, ఎల్అండ్టీ, అపోలో, కేర్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
డైట్ చార్జీల పెంపు
పేద విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం హాస్టళ్లలోని వారికి ఇచ్చే డైట్ చార్జీలను పెంచింది. రాష్ట్రంలో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టడంతోపాటు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించేందుకు అనుగుణంగా అప్పటి ఈ డైట్ చార్జీలను పెంచారు. అప్పటివరకు ఉన్న చార్జీలను అదనంగా 26శాతం పెంచారు. ట్రైబల్, ఎస్సీ, బీసీ సంక్షేమ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని గురుకులాల్లోని 7లక్షల 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
సగర్వంగా నిలిచేలా 125 అడుగుల అంబేదర్ విగ్రహం
అంబేదర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంతోపాటు, వాటి సాధనకు ప్రజాప్రతినిధులు, అధికార గణం కలిసి పనిచేసే లక్ష్యంతో ప్రపంచంలోనే పెద్దదైన 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంబేదర్ పేరుతో స్మృతివనం ఏర్పాటుచేయనున్నట్టు 2016 ఏప్రిల్ 14న నిర్వహించిన 125వ అంబేదర్ జయంతి కార్యక్రమంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించి శంకుస్థాపన చేశారు. 2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని అంబేదర్ మనవడు ప్రకాశ్ అంబేదర్తో కలిసి ఆయన ఆవిషరించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో 11.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. విగ్రహ స్థాపనకు రూ.146.50 కోట్లు ఖర్చు చేశారు.
ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు
దళితులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా, పది మందికి ఉపాధి కల్పించే ఎంటర్ ప్రెన్యూయర్లుగా తయారు చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,60,914 మందికి రూ.2,013.64 కోట్లను సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పించి ప్రోత్సహించింది.
101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం దళితవాడల్లో ఉచిత విద్యుత్తు సరఫరాను అమలుచేసింది. ప్రతి ఇంటికీ 101 యూనిట్ల వరకు ఉచితంగా అందించింది. 2014-15 నుంచి 2022-23 వరకు 22,23,475 గృహాలకు రూ.284.13 కోట్లతో ఉచితంగా కరెంటు సరఫరా చేసింది.
టీఎస్ ప్రైడ్
దళితులను ఎంటర్‌ప్రెన్యూయర్లను చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్థిక సాయంతోపాటు వ్యాపార పారిశ్రామికరంగాల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పించేందుకు తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యు బేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టీఎస్ ప్రైడ్) పథకం కింద పెట్టుబడి రాయితీలను అందించింది. టీఎస్ ప్రైడ్ ద్వారా 60,904మందికి రూ.2,747 కోట్లు ఖర్చు చేసింది.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాటి తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ డిగ్రీ కాలేజీల ఊసే లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 30 కాలేజీలను ఏర్పాటు చేసింది. తద్వారా 25,200 విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లు కింద ఏటా 2.5లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. 2014-23 వరకు 26,68,397 మంది విద్యార్థులకు రూ.3,762.22 కోట్లను పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లు ఇచ్చింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రీ మెట్రిక్ సాలర్షిప్ల కింద అందించే మొత్తాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.65వేల నుంచి రూ.1,50,000లకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75వేల నుంచి రూ.2లక్షలకు పెంచింది. 2014-15 నుంచి 2022-23 వరకు 5,78,417 మంది విద్యార్థులకు రూ.368.06 కోట్లను ప్రభుత్వం ప్రీ మెట్రిక్ సాలర్షిప్లుగా అందించింది.