హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా ప్రభంజన్‌యాదవ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా ఢిల్లీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న ప్రభంజన్‌యాదవ్.. ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. ఇది ప్రభంజన్‌యాదవ్ ఉద్యమ నిబద్ధతకు నిదర్శనమని పేరొన్నారు.
మహాత్మాఫూలే, అంబేదర్ సామాజిక, తాత్విక ఆలోచనా దృక్పథంతో, బీసీ కులాల హకులు, పురోగతి కోసం నిత్యం తపించే ప్రభంజన్‌యాదవ్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్వికుడు, సామాజిక ఉద్యమకారుడిని కోల్పోయిందని బుధవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభంజన్ ఉద్యమ నిబద్ధత గొప్పదని ప్రశంసించారు. ఆయన కుటుంబసభ్యులకు వినోద్‌కుమార్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
సీనియర్ ఫొటో జర్నలిస్ట్ షేక్ నసీరుద్దీన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉర్దూ సహా ప లు పత్రికల్లో నాలుగు దశాబ్దాలపాటు పనిచేసి, ఫొటో జర్నలిజంలో గుర్తింపు తెచ్చుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నసీరుద్దీన్ మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు.