
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.3లక్షల పరిహారం ప్రకటించటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదొక గొప్ప ముందడుగంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ‘సీఎం గారు.. మీరు సూపర్, గొప్ప హృదయం మీది, గుడ్ డెసిషన్’ అని కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, కేంద్రం వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఇతర రాష్ర్టాలు సైతం రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాయి. సీఎం కేసీఆర్ రూ.3 లక్షలు పరిహారం ప్రకటించటం గర్వంగా ఉన్నదంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. రెండున్నర గంటల్లోనే 6వేల మంది లైక్ చేయగా, దాదాపు రెండు వేల మంది రీట్వీట్ చేశారు. ‘ఇప్పుడే కాదు.. లాక్డౌన్ సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారతను చాటుకొన్నారు. వలస కార్మికులకు రూ.500 చొప్పున, రేషన్ బియ్యం, భోజన వసతి కల్పించారు. ప్రైవేట్ టీచర్లకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం అందించారు. ఇలా ఎన్నో సందర్భాల్లో పేదల కోసం చేయాల్సింది చేశారు. ఇప్పుడు కడుపునింపే రైతన్నలే చనిపోతే, వారి కుటుంబాలకు అండగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు’ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.