కేసీఆర్.. తెలంగాణ గడ్డ కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం 25 ఏండ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఓ శిఖరం. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన పోరాటం ఆగడం లేదు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనితరసాధ్యమైన పోరాటం చేసిన కేసీఆర్.. నేడు తెలంగాణ రైతన్నల కోసం మరో పోరాటం చేస్తున్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరై తెలంగాణ గోసను కమిటీ కండ్లకు కట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రైతాంగం కోసం మరోసారి విచారణకు హాజరయ్యారు.
అప్పుడు పరాయి ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ అయితే.. ఇప్పుడు సొంత రాష్ట్ర సర్కారు వేసిన ఘోష్ కమిషన్. ఉమ్మడి రాష్ట్రంలో సాగుకు చుక్కనీళ్లు లేక ఆగమైన వ్యవసాయానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా జీవధారగా మారిందో, రైతుల గోసను ఏ విధంగా తీర్చిందో ఘోష్ కమిషన్‌కు కండ్ల ముందుంచారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం నిర్మిస్తే.. ఇప్పుడు అదే రైతుల కోసం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు కాళేశ్వరాన్ని బలిపెట్టకుండా.. మళ్లీ రైతులు సాగునీళ్ల కోసం గోస పడకుండా అడ్డుకునేందుకు మళ్లీ పోరాటానికి దిగారు.
హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం విచారణకు హాజరయ్యారు. కేసీఆర్‌కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బీఆర్కే భవన్, సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ గులాబీ శ్రేణులతో నిండిపోయాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగాయి. ఉదయం 8 గంటల నుంచే కార్యకర్తలు బీఆర్కే భవన్‌కు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివస్తుండటంతో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటుచేసింది. వందల సంఖ్యలో పోలీసులను మోహరించిన సర్కారు.. బారికేడ్లను ఏర్పాటుచేసి కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఎవరినీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్‌పై కక్షపూరితంగా విచారణ చేయిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు వినోద్, కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, దేవీప్రసాద్, బాలరాజుయాదవ్, పల్లె రవి, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్లో విచారణకు హాజరయ్యేందుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ను చూసేందుకు, ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. దీంతో పోలీసులు బీఆర్కే భవన్ పరిసరాలను దిగ్బం ధం చేశారు. భారీగా భారికేడ్లను, ముండ్లకంచెలను ఏర్పాటుచేశారు. ఎర్రవల్లి నుంచి బీఆర్కే భవన్ వరకు సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్ వర్గాలే తెలిపాయి. బీఆర్కే భవన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు.
పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నుంచి బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. మళ్లీ తిరిగి మద్యా హ్నం ఒంటిగంట సమయంలో ఆయన బయటకు వచ్చారు. సుమారు రెండు గంటలపాటు కేసీఆర్ బీఆర్కే భవన్‌లోనే గడిపారు. అంతకు ముందు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఉదయం 10.28 గంటలకు బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ కోర్టు హాలులోకి వెళ్లిన కేసీఆర్.. తిరిగి 12.50 గంటలకు తిరిగి వచ్చారు. అంటే సుమారు 50 నిమిషాలపాటు విచారణ జరిగింది.
కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ పరిసరాలన్నీ జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగాయి. ఒక దశలో నినాదాలతో విచారణకు ఇబ్బంది కలగడంతో కమిషన్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి నినాదాలు ఆపాల్సిందిగా శ్రేణులను కోరడం గమనార్హం. దీంతో కొద్దిసేపు కార్యకర్తలు సంయమనం పాటించారు. విచారణ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తిరిగి వెళ్లే సమయంలో తన కోసం వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేశారు. కారులో నుంచి బయటకు వచ్చిన ఆయన గులాబీ శ్రేణులకు నమస్కరించారు. వాస్తవానికి పోలీసులు కేసీఆర్‌ను కార్యకర్తల వైపు వెళ్లనీయకుండా మరో దారిలో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
కానీ కేసీఆర్ అందుకు అంగీకరించకుండా.. తన కార్యకర్తలను కలిసే వెళ్తానని చెప్పి.. కార్యకర్తలు ఉన్న వైపునకు వచ్చారు. అక్కడ కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి పోలీసులు సూచించిన మార్గంలో వెళ్లిపోయారు. కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భంలో ఆ ప్రాంగణంలో మొత్తం ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్‌ను చూడగానే కార్యకర్తలంతా ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణను తన చాణక్యనీతితో అగ్రపథంలో నడిపిన కేసీఆర్.. ఈ రోజు కమిషన్ ముందు హాజరుకావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో కార్యకర్తలంతా కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.