హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ త్వరలో హైదరాబాద్ రానున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ పర్యటనపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పొలిటికల్ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశిస్తున్నవారికి సంబంధించి పొలిటికల్ కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలో చర్చ జరుగుతున్నది. మంత్రివర్గంలో మంత్రుల మధ్య అభిప్రాయభేదాలు, పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య సమన్వయ లోపం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీవకరణ బిల్లుల వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ చేపడితే, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే ఎవరిని తొలగిస్తారు? కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు లెక్కలేసుకుంటున్నారు.