వరంగల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు శరాఘాతంగా మారుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశానికి రవాణా వారధిగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌పై కత్తిగట్టింది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొ న్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకపోగా దశాబ్దాలుగా కాజీపేటలో ఉన్న క్రూలింక్ వ్యవస్థను విజయవాడకు తరలిస్తున్నది. ఈ నిర్ణయంతో వెయ్యిమంది సిబ్బంది విజయవాడకు తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఉత్తర-దక్షిణ భారత వారధి
దక్షిణమధ్య రైల్వే జోన్లో కాజీపేట జంక్షన్.. ఉత్త ర, దక్షిణ భారతాల్ని కలుపుతున్నది. నిజాం ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ జంక్షన్ మీదుగా నిత్యం వందల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సగటున 40 వేల ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు కాజీపేట జంక్షన్ ప్రత్యేకమైనది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కరెంటు ఉత్పత్తి కేంద్రాల కు బొగ్గు రవాణాలో ఇదే కీలక కేంద్రం. సిమెంటు, గ్రానైట్, బియ్యంతోపాటు అన్ని రకాల నిత్యావసర సరుకుల రవాణా కాజీపేట మీదుగానే వెళ్తాయి. లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు, టీటీలు కాజీపేట క్రూలింక్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తా రు. బల్లార్షా నుంచి ఒక లోకోపైలట్ రైలును నడుపుకొంటూ కాజీపేట మీదుగా హైదరాబాద్ లేదా విజయవాడ వరకు వెళ్తారు. అక్కడి నుంచి వేరే రైలులో తిరిగి కాజీపేటకు చేరుకుంటారు. ఇలా పైలట్ల డ్యూటీ ల నిర్వహణ అంతా కాజీపేట క్రూలింక్ నుంచే జరుగుతుంది. అన్ని విభాగాల్లో కలిపి ఇక్కడ వెయ్యి మందివరకు ఉండేవారు. రైల్వేశాఖ ఇప్పటికే క్రూలింక్ తరలింపు చేపట్టింది. సగం మందిని విజయవాడకు పంపించింది. నిబంధనల ప్రకారం ఒక డివిజన్ పరిధిలోని వారు డిప్యూటేషన్ తరహాలో మరో డివిజన్లో 5 శాతం కంటే మించకూడదు. కానీ, నిబంధనలు బేఖాతరు చేస్తూ సికింద్రాబాద్ డివిజన్లోని కాజీపేట కేంద్రంగా పనిచేసే వారిని విజయవాడ డివిజన్‌కు రైల్వేశాఖ పంపిస్తున్నది. ఇప్పుడు అధికారికంగానే క్రూలింక్ డిపోను తరలిస్తున్నది.
డివిజన్ లేదు.. వ్యాగన్ ఫ్యాక్టరీ రాలేదు
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లో కాజీపేట జంక్షన్ నుంచే రైల్వేశాఖకు అధిక ఆదాయం వస్తున్నది. కాజీపేటను డివిజన్ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయాలనే డి మాండ్ ఎప్పటినుంచో ఉన్నది. ఇక్కడ అన్ని సౌకర్యా లు ఉన్నాయని రైల్వేశాఖ సైతం గతంలో ప్రతిపాదనలు చేసింది. ఆచరణలో మాత్రం అడుగు ముందు కు పడలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం 40 ఏండ్లకుపైగా ఇక్కడి రాజకీయ పార్టీలు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోనూ కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల ని అప్పటి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. తెలంగాణ ఏర్పడి ఏడున్నరేండ్లు గడిచినా ఆచరణలోకి రాలేదు. ఇక్కడ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌ను ఏ ర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికోసం ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వం మడికొండలో భూములు ఇచ్చినా పనులు మొదలు కాలేదు. కాజీపేట జంక్షన్ ప్రాధాన్యాన్ని కేంద్రం క్రమంగా మసకబారుస్త్తున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.