హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు మరింత ప్రాధాన్యమిచ్చేందుకు, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులకు సంబంధించిన 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఏపీవో) అమలుకు టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (టీసీఎఫ్) పాలక మండలి ఆమోదం తెలిపింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో టీసీఎఫ్ పాలకమండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టైగర్ రిజర్వు గుండా వెళ్లే వాహనాల టోల్ ఫీజులను సవరించాలని, బయటి ప్రాంతాల వాహనాలకు రూ.600, స్థానిక వాహనాలకు రూ.300 టోల్ ఫీజు విధించాలని అధికారులకు సూచించారు. అడవుల్లో నివసించే గిరిజనుల భాగస్వామ్యంతో ఎకో టూరిజం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను నామినేషన్ విధానంలో చేపట్టాలని, టెండర్ విధానంలోనే పరికరాల కొనుగోళ్లు నిర్వహిచాలని స్పష్టం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాల వద్ద ప్రమాదాల నివారణకు భద్రతా జోన్లు ఏర్పాటుచేసి, స్పష్టమైన హెచ్చరిక బోర్డు లు పెట్టాలని సూచించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ సువర్ణ, అధికారులు శాంతారాం, రేవంత్‌చంద్ర, ఆంజనేయులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని జూపారుల అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ జూపార్స్ అథారిటీ ఆమోదించింది. రాష్ట్రంలోని 14 జూపారుల అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, మౌలిక వసతుల విస్తరణ, సందర్శకుల సేవల మెరుగుదల కోసం రూ.82.24 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ జూపార్స్ అథారిటీ 15వ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జూపారులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ సువర్ణ, వైల్డ్‌లైఫ్ చీఫ్ వినయ్ కుమార్, సీనియర్ అటవీ అధికారి రత్నాకర్ జౌహారీ, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, జూ డైరెక్టర్ సునీల్ హీరామత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.