MLC Kavitha | బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. బోకేలు ఇచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీపడ్డారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదిస్తూ.. పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానన్న కవిత.. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటాననన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామమన్నారు. ఇంటికి చేరుకున్న కవితకు నివాసంలో తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. అలాగే, కుటుంబీకులను ఆలింగనం చేసుకొని.. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించారు. రేపు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకొని కేసీఆర్‌తో భేటీ అవుతారు.