హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుకెదురైంది. పార్టీ పేరు ఖరారు చేసే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీచేసిన నోటీసులపై ఆమె దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈసీ నోటీసులకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేస్తూ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ పేరు మీద పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో, ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలంటూ గత నెల 23న ఎన్నికల సంఘం కవితకు ఒక లేఖ రాసింది. ఈ లేఖను సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈసీ నోటీసులపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధా నం ఇవ్వాలని సూచించింది. తెలంగాణ రక్షణ సమితి లేదా తెలంగాణ రక్షణ సేన అనే పేర్లు పాత ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును పోలి ఉన్నాయని అభిప్రాయపడింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు.. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వడంతోపాటు, పార్టీ పేరు కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను ఈసీకి ఇవ్వాలని సూచించింది.