నయీంనగర్, డిసెంబర్ 13: మనువాద ఫాసిస్టు శక్తుల తో దేశానికి ముప్పు ఏర్పడు తున్నదని కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశా రు. సామాజిక మార్పు కోసం కవులు తమ రచనల ద్వారా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేయూ విశ్వవిద్యాలయ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో వైస్ చాన్స్లర్ రమేశ్ అధ్యక్షతన ‘దళిత, గిరిజన సాహిత్యం-సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ.. సకల ఆధిపత్యాలను ధ్వంసం చేసేది సాహిత్యమేనని స్పష్టం చేశారు. జ్ఞానాన్ని ప్రసరింపజేయడంలో వివక్ష ఉండకూడదని సూచించారు.
ఉన్న స్థితి నుంచి ఉన్నతీకరణ జరగాలని, యాతన, వేదన, తపన అనుభవ జ్ఞానం, పంచభూతాలకు దగ్గరగా ఉండేదే కవిత్వమని పేర్కొన్నారు. హృద య సంబంధం, మానసిక అనుభూతి కవిత్వమని తెలిపారు. ఆదివాసీల్లో అత్యంత మానవీయత ఉంటుందని, దళిత సాహిత్యంతో విప్లవ, వామపక్ష, కమ్యూనిస్ట్ ఉద్యమాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత రచనలు, సాహిత్యం ప్రమాదకరంగా వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ప్రశ్నార్థకంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సదస్సులో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఐలయ్య, కేయూ వీసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.