హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం మల్లన్న ఆలయంలో కార్తికమాసం శని, ఆది,సోమ, కార్తిక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులకు శని, ఆది, సోమవారాలలో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
శ్రీశైలంలో 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్తిక మాసం ఏర్పాట్లపై ఆలయ పరిపాలన భవనంలో ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు. ఈ నెల 26న పౌర్ణమి ఘడియలు రావడంతో ఆరోజే కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారె సమర్పణ, జ్వాలాతోరణం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.