ACB Rides | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 17 : అవినీతి నిరోధక శాఖ వలకు రెండు అవినీతి చేపలు చిక్కాయి. అద్దె కారు బిల్లు చెల్లింపు కోసం రూ.8వేల లంచం తీసుకుంటూ జిల్లా పరిషత్‌లోని పంచాయతీరాజ్ శాఖలోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లాకేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖలో గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు రూ.30వేల చొప్పున పది నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. నాలుగు నెలల బిల్లు కొద్ది రోజుల కిందట చెల్లించారు. మిగతా ఆరు నెలల బిల్లు రూ.1.80 లక్షల కోసం రూ.8వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు కారు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
మంగళవారం సంబంధిత అధికారి డిమాండ్ చేసిన మొత్తం సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌కు వాహనం యజమాని అందిస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనను విచారించగా.. ఏఈ శరత్ డబ్బులు తీసుకోవాలని సూచించడంతోనే తాను తీసుకున్నట్లు తెలుపగా.. అక్కడే ఉన్న ఏఈని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. లంచంగా తీసుకున్న రూ.8వేలు రికవరీ చేసి, ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనులు చేసేందుకు లంచాలు అడిగితే.. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. 9440446106 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయొచ్చని.. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్ సోషల్ మీడియా ద్వారా సైతం తమకు సమాచారం ఇవ్వొచ్చని చెప్పారు. 9154388954 అనే నెంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.