కరీంనగర్, మే 10 (నమస్తే తెలంగాణ)/తెలంగాణచౌక్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు పలు సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. దళిత సంఘాలతోపాటు కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆయా సంఘాల వారు ప్రకటించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేశ్ అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్లో దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మేడి మహేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో దళితుల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. రిజర్వేషన్లు తొలగించాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు భావజాలం కలిగి, దళిత బహుజన వాదాన్ని తన విధానంగా మార్చుకున్న కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు మాదిగ సంఘాల నాయకులు వంతడుపుల సంపత్, అశోక్, సాంబారి కొమురయ్య, క్యాదాసు ప్రభాకర్, భీమారపు సతీశ్ తదితరులు తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం వారు వినోద్‌కుమార్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు కార్మిక సంఘాలు బాసటగా నిలిచాయి. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఆటో యూనియన్ సంక్షేమ సంఘం నగరం కమిటీ ఆధ్యక్షుడు మద్దెల రాజేందర్ శుక్రవారం కరీంనగర్లో మీడియా మాట్లాడారు. బీజేపీ సర్కారు తెచ్చిన లేబర్ కోడ్‌తో కార్మికుల స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు న్యాయమైన హక్కులు దక్కాలంటే, పార్లమెంట్లో మన గళం వినపడాలంటే వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.