భద్రాచలం, జూలై 20: తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ విలీన గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ‘ఆంధ్రా వద్దు.. తెలంగాణే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ పిల్లాపాపలతో కలిసి రోడ్డెక్కారు. బుధవారం ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెంలో పిల్లాపాపలతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం మండలంలో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామాలను రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపారని, దానిని నిరసిస్తూ తాము చాలాకాలం ఆందోళన చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు.
తమను తెలంగాణలో కలపాలంటూ నిరసనలు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. తాజాగా గోదావరి వరదల కారణంగా విలీన గ్రామాలు మునిగిపోయాయని, ముంపు బాధితులు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. అయినా ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులుగానీ ఇటువైపు చూడలేదని మండిపడ్డారు. తమ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. అక్కడి ముంపు ప్రజలను కాపాడుకుందని చెప్పారు. కానీ తమను మాత్రం ఏపీ ప్రభుత్వం కనీసం పలుకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.