హైదరాబాద్, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టు గేట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, తద్వారా ప్రమాదాలను ముందస్తుగానే నివారించే అవకాశముంటుందని ఇంజినీర్ నిపుణుడు, పలు ప్రతిష్టాత్మక సంస్థలకు సాంకేతిక సలహాదారుడు నాగినేని కన్నయ్యనాయుడు ఇంజినీర్లకు సూచించారు. ‘సాగునీటి ప్రాజెక్టుల గేట్లు విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు’ అనే అంశంపై ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా గురువారం నిర్వహించిన వర్షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నీటిపారుదల ప్రాజెక్టుల విశిష్టతలను, సాగునీటి రంగంలో వాటి ప్రాధాన్యతలను వివరించారు. గేట్ల నిర్వహణను విస్మరిస్తే వరదలు వచ్చినపుడు, గేట్లు ఒకసారిగా తెరుచుకోవాలంటే కొన్నిసార్లు తెరుచుకోవని, ఫలితంగా వరదలకు గేట్లు కొట్టుకుపోతాయని, దీంతో పంట సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
అదేతరహాలో ఇటీవల తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. డ్యామ్‌లో నీళ్లు ఉండగానే కొట్టుకుపోయిన గేటు స్థానంలో మరొక నూతన గేట్‌ను ఏర్పాటు చేశామని, ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే నష్టాలను అధిగమించవచ్చని వివరించారు. గేట్లు విఫలమైన సమయంలో తీసుకోవాల్సిన అనేక సాంకేతిక సంబంధిత విషయాలపై ఇంజినీర్లకు సూచనలిచ్చారు. సందేహాలను నివృత్తి చేశారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్రావు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అధికారులు డాక్టర్ ఆదినారాయణ నరేశ్, కవిత తదితరులు కన్నయ్యనాయుడును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడులోని కావేరి ప్రాజెక్టు, తిరువనంతపురం, కర్ణాటక, చండీగఢ్‌కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.