హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకొని ఉన్న పెద్ద గోలొండ గ్రామంలో కల్యాణీ చాళుక్యుల కాలంనాటి ప్రాచీన గణపతి విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్రకారులు వెల్లడించారు. చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్ జైకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితోపాటు ఆధునిక తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్ శనివారం శంషాబాద్ మండలం పెద్ద గోలొండ గ్రామంలోని భగీరథ శివాలయం, ఆంజనేయ ఆలయంలోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు.
శివాలయం ముందు 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, 2 అడుగుల మందంతో నల్లశానపు రాతిలో చెకిన గణేషుని విగ్రహాలను గుర్తించారు. వీటిలో ఓ గణపతి రెండు చేతుల్లో దంతం, కుడుము ఉన్నాయని, తలపై చిన్న కిరీటం, లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయ కంకణాలు, కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చొని ఉన్నాడని తెలిపారు. క్రీ.శ.12వ శతాబ్దానికి చెందిన కల్యాణీ చాళుక్యుల శిల్పశైలికి అద్దం పడుతున్నదని వివరించారు.
ఇదే గ్రామంలోని ఆంజనేయ ఆలయంలో క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన ఉమామహేశ్వర శిల్పం, అద్భుతంగా అలంకరించిన నంది విగ్రహాలతోపాటు కాకతీయ స్తంభం, కప్పురాయి ఉన్నట్టు తెలిపారు. ఇవి హైదరాబాద్ నగర చరిత్రను మరో 400 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. వీటిని భద్రపరిచి భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి, హరగోపాల్, భద్రగిరీశ్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ శిల్పాలపై ఉన్న రంగులను తొలగించి పీఠాలపై నిలబెట్టాలని, వాటి చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పరచాలని కోరారు.