గంగాధర, మే 7: పేదింట కల్యాణలక్ష్మి సంబురం అంబరాన్నంటింది. కవల బిడ్డల పెండ్లిళ్లకు ఒకేసారి కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష చొప్పున మంజూరుకావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన తొర్రికొండ విజయ-అంజయ్యకు దంపతులకు కవల కూతుళ్లు సంగీత, సౌజన్య ఉన్నారు. వ్యవసాయమే వీరి జీవనాధారం. సంగీతను బీఎస్సీ అగ్రికల్చర్, సౌజన్యను పీజీ చదివించారు. గత ఏడాది జూన్ 23న ఇద్దరి బిడ్డల పెండ్లి చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఇటీవలే వీరికి కల్యాణలక్ష్మి కింద లక్షానూటాపదహారు రూపాయల చొప్పున మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారి గ్రామానికి వెళ్లి విజయ-అంజయ్యకు అందజేశారు. చెక్కులను అందుకొన్న ఆ కుటుంబం మురిసిపోయింది. బిడ్డల పెండ్లిళ్లకు మేనమామలా అండగా నిలిచిన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు తెలిపింది.