Kavitha | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్లో ప్రసంగించి కవిత.. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను మరోసారి విజ్ఞప్తి చేశారు.
కవిత సమర్పించిన రాజీనామాను మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా శాసనమండలి చైర్మన్ ఆమోదించారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. ఈ రాజీనామా, ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపారు.