హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సతీశ్ సొంతూరు మహబూబాబాద్ జిల్లా రామానూజపురంలో సొంత ఖర్చులతో ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. సోమవారం ఆ జిల్లా పర్యటనకు వెళ్లనున్న కవిత దీన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మరిపెడ మండలం చిల్లంచర్లలో జాగృతి మహిళా నేత మరిపెల్లి మాధవి గృహప్రవేశానికి హాజరవుతారు.
అడిగిన వెంటనే అభయం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చిర్రా సతీశ్‌కు చిన్నప్పటి నుంచే కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మైస్థెర్యంతో డిగ్రీ పూర్తి చేశారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తనకు ల్యాప్‌టాప్, జిరాక్స్ మిషన్ కొనిపించి స్వయం ఉపాధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్పీ కవితకు మెస్సేజ్ చేశారు. ఆమె వెంటనే స్పందించి అభయమిచ్చారు. వారం కూడా తిరగకముందే ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలను సమకూర్చారు.
కేసీఆర్ పేరిట ఇంటర్నెట్ సెంటర్
ఈ ఇంటర్నెట్ సెంటర్‌కు తన అభిమాన నేత కేసీఆర్ పేరును సతీశ్ పెట్టారు. పెద్ద మనస్సుతో సాయం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కవితకు తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పారు.